మా విషయాల్లో జోక్యం వద్దు: ఐరాస మానవహక్కుల సంఘంపై భారత్ ఫైర్
ABN , Publish Date - Oct 11 , 2026 | 07:23 AM
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధం ఆందోళనకరమంటూ ఐరాస మానవ హక్కుల సంఘం చేసిన వ్యాఖ్యలపై భారత్ సీరియస్ అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధం ఆందోళనకరమంటూ ఐరాస మానవ హక్కుల సంఘం చేసిన వ్యాఖ్యలపై భారత్ సీరియస్ అయ్యింది. భారత అంతర్గత వ్యవహారాల్లో ఐరాస అనవసరంగా జోక్యం చేసుకుంటోందని మండిపడింది. ఈ మేరకు జెనీవాలోని భారత శాశ్వత ప్రతినిధి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చిందని భారత శాశ్వత ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు భారత్‌లో రక్షణలు ఉన్నాయని అన్నారు. స్వతంత్రమైన న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి, ఐరాస మానవ హక్కుల ఆందోళన అనవసరమని తేల్చి చెప్పారు.
ఇతర దేశాల్లో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తే ఐరాస మానవ హక్కుల సంఘం తన నిష్ఫాక్షికత నిరూపించుకున్నట్టు ఉంటుందని చెప్పింది. భారత అధికారులు చట్టపరంగా నడుచుకున్నారని, అభ్యంతరాలపై స్పందించేందుకు భారత్‌లో అనేక వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది. పౌరుల కోసం భారత రాజ్యాంగంలో, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల్లో ఎన్నో రక్షణలు ఉన్నాయని పేర్కొంది.
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలపై అంతకుముందు ఐరాస మానవహక్కుల సంఘం ప్రతినిధి స్పందించారు. ప్రజలకు ఉన్న నిరసన తెలిపే హక్కును గౌరవించాలని భారత అధికారులకు తాము విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. నిరసనలపై ఆంక్షలు అవసరం మేరకు, తగిన రీతిలో ఉండాలని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి విషయంలో సంయమనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. నిర్బంధంలో ఉన్న వారిని తక్షణం, బేషరతుగా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. నిరసనకారులతో అర్థవంతమైన చర్చలు జరిపి వారి అభ్యంతరాలకు పరిష్కారం చూపాలని కూడా సూచించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
రణరంగంలా ఢిల్లీ వీధులు.. మరోసారి నిరసనకు సీజేపీ పిలుపు..
కెనడాలో తెలుగు మహిళ ప్రచార హోరు