Share News

డ్రోన్ల దండు వచ్చేస్తోంది!

ABN , Publish Date - Jun 05 , 2026 | 06:00 AM

ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లు సైనిక వ్యూహాలనే సమూలంగా మార్చేస్తున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించడంతోపాటు, శత్రు స్థావరాలపై కచ్చితమైన దాడులు చేయడానికి,...

డ్రోన్ల దండు వచ్చేస్తోంది!

  • 17వేల కోట్ల విలువైన డ్రోన్ల సేకరణకు భారత్‌ సిద్ధం

న్యూఢిల్లీ, జూన్‌ 4: ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లు సైనిక వ్యూహాలనే సమూలంగా మార్చేస్తున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించడంతోపాటు, శత్రు స్థావరాలపై కచ్చితమైన దాడులు చేయడానికి, నిఘా సమాచారం సేకరించడానికి, ఆత్మాహుతి దాడులకు ఇవి కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత్‌ కూడా డ్రోన్ల దండుపై దృష్టిపెట్టింది. తన సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి దేశీయ తయారీదారుల నుంచి సుమారు రూ.17,000 కోట్ల విలువైన డ్రోన్లు (మానవరహిత వైమానిక వాహనాలు-యూఏవీ) కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం డ్రోన్ల సైన్యాన్ని పెంచుకోవాలని భారత్‌ నిర్ణయించింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డ్రోన్ల సేకరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, దేశీయ తయారీదారులతో ఒప్పందాలు ఖరారైతే రాబోయే 18 నుంచి 24 నెలల్లో డ్రోన్ల సరఫరా మొదలువుతందని భావిస్తున్నారు. డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు స్మిత్‌ షా మాట్లాడుతూ.. ఈ డ్రోన్ల కొనుగోళ్లు తదుపరి దశలో రూ.20వేల కోట్లను అధిగమించవచ్చని పేర్కొన్నారు. తద్వారా భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ల కొనుగోలు కార్యక్రమంగా ఇది నిలవనుందని చెప్పారు. అదానీ గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ వంటి ప్రముఖ రక్షణ రంగ సంస్థలతోపాటు.. ఐడియా ఫోర్జ్‌, న్యూస్పేస్‌ రిసెర్చ్‌, ఆస్టెరియా ఏరోస్పేస్‌ వంటి డ్రోన్ల తయారీ సంస్థల నుంచి ఈ కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది. తద్వారా భారతీయ కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 06:00 AM