Share News

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు... కేంద్రం

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:10 PM

రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తు్న్నాయని, రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పారు.

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు... కేంద్రం
Sujata Shama

న్యూఢిల్లీ: రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు (Crude oil) నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారంనాడు తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పారు.


అంతర్జాతీయ ధరల ట్రెండ్‌‌ను ప్రస్తావిస్తూ, రెండు నెలల క్రితం వరకూ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70 డాలర్లు ఉండగా, అది ఇప్పుడు 100 డాలర్లు దాటిందని చెప్పారు. ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని తెలిపారు. 2022 ఏప్రిల్ 6 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని, 2024 మార్చిలో ధరలు రూ.2 చొప్పున తగ్గించామని, ఇప్పటికీ అదే అమల్లో ఉందని వివరించారు. అంతర్జాతీయ ధరల్లో అస్థిరత నుంచి దేశీయ వినియోగదారుల పరిరక్షణకు భారత ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని, తద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల లేకుండా చర్యలు తీసుకుందని చెప్పారు. దేశీయ మార్కెట్‌లో ఏటీఎఫ్, డీజిల్ లభ్యత కోసం ఎగుమతులపై సుంకం విధించినట్టు చెప్పారు.


ప్యానిక్ కొనుగోళ్లు వద్దు

పెట్రోల్, డీజిల్ తగినంతగా అందుబాటులో ఉన్నాయని, ఎవరూ అందోళన చెందవద్దని, ప్యానిక్ కొనుగోళ్లకు పాల్పడవద్దని కోరారు. గృహావసరాలు, సీఎన్‌జీ ట్రాన్స్‌పోర్ట్‌కు 100 శాతం సరఫరాకు భరోసా ఇచ్చారు. విస్తరణ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. మార్చిలో 3,25,000 కనెక్షన్లకు నేచురల్ గ్యాస్ సరఫరా చేశామని, 2,85,000 కొత్త కనెక్షన్లు ఇచ్చామని, 3,50,000 కొత్త వినియోగదారులు కనెక్షన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు.


ఎల్జీజీకి సంబంధించి 60 శాతం దిగుమతులపై మనం ఆధారపడి ఉన్నామని చెప్పారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు (సౌదీ సీపీ బెంచ్‌మార్క్) 522 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగిందన్నారు. అయినప్పటికీ డొమెస్టిక్ వినియోగదారుల ఎల్‌పీజీ సిలెండర్ల ధరలను పెంచలేదని చెప్పారు. ధరల్లో పెరుగుదల వల్ల తలెత్తిన నష్టాన్ని తట్టుకునేందుకు ఆయిల్ మార్గెటింగ్ కంపెనీలకు (ఓఎంసీలు) ప్రభుత్వం సపోర్ట్ అందిస్తోందన్నారు. 2023లో ఓఎంసీలకు రూ.22,000 కోట్లు కేటాయించగా, 2025-26లో సుమారు రూ.30,000 కోట్లకు ఆమోదం తెలిపామని చెప్పారు. ఏ ఒక్క గ్యాస్ ఏజెన్సీ నుంచి స్టాకు లేదనే సమాచారం లేదని, మంగళవారంనాడు కూడా 60 లక్షల సిలెండర్ల పంపిణీ జరిగిందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

Updated Date - Apr 01 , 2026 | 06:18 PM