డెంగీకి టీకా.. దేశంలో తొలి వ్యాక్సిన్
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:35 AM
దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ(సెక్) ఆమోదం తెలిపింది. జపాన్‌కు చెందిన...
4 - 60 ఏళ్ల వయసు వారికి
‘క్యూడెంగా’కు నిపుణుల కమిటీ ఆమోదం
బయోలాజికల్ ఈ భాగస్వామ్యంతో తయారు చేయనున్న జపాన్ కంపెనీ
దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ(సెక్) ఆమోదం తెలిపింది. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మాసూటికల్ కంపెనీ అభివృద్ధి చేసిన క్యూడెంగా (టీఏకే-003) వ్యాక్సిన్‌కు సెక్ ఆమోదముద్ర వేసింది. ఈ వ్యాక్సిన్‌ను 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి వినియోగించవచ్చు. ఈ ఏడాదిలోనే దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశంలో భారీగా పెరిగిపోతున్న డెంగీపై పోరుకు ఈ వ్యాక్సిన్ ఆమోదం ఒక ముందడుగుగా భావిస్తున్నారు. క్యూడెంగా అనేది ఒక టెట్రావాలెంట్ వ్యాక్సిన్. ఇది నాలుగు రకాల డెంగీ సిరోటైప్‌ల (డెన్‌వీ-1 నుంచి డెన్‌వీ-4) వరకు రక్షణ కల్పిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను సాధారణంగా మూడు నెలల వ్యవధితో రెండు డోసులలో ఇస్తారు. ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి ముందు గతంలో డెంగీ సోకిందా లేదా అని పరీక్షించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను స్థానికంగా తయారు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ (బయో ఈ)తో తకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2030నాటికి వార్షికంగా ఉత్పత్తిని 5 కోట్ల డోసుల వరకు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నారు. స్థానికంగా తయారీ వల్ల ఖర్చులు కలిసి వస్తాయని, వ్యాక్సిన్ లభ్యత పెరుగుతుందని, వేగవంతంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
దేశంలో భారీగా డెంగీ కేసులు..
దేశంలో ఏటా భారీ స్థాయిలో డెంగీ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023, 2024 సంవత్సరాల్లో వార్షికంగా 2.3 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. 2020లో దాదాపు 44వేల కేసులు నమోదు కాగా వీటి సంఖ్య తర్వాతి కాలంలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో జనవరి, నవంబరు మధ్య 1.13 లక్షలకు పైగా కేసులు, 94 మరణాలు నమోదయ్యాయి. అయితే వాస్తవ సంఖ్య ఇంతకన్నా ఎక్కువే ఉండవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభణతో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీపై పోరాటంలో భాగంగా భారత్ మొట్టమొదటి నివారణ వ్యాక్సిన్ క్యూడెంగాను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ఎప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఏడాదిలోనే విడతల వారీగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టీకాతో రక్షణ నాలుగేళ్లకుపైగా ఉంటుందని గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ ద్వారా తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటికే 30కి పైగా దేశాలు ఆమోదం తెలిపాయి. ఇదిలా ఉండగా.. మన దేశ మొట్టమొదటి స్వదేశీ డెంగీ వ్యాక్సిన్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఫార్మా కంపెనీ పనేసియా బయోటెక్ తన దేశీయ టెట్రావాలెంట్ వ్యాక్సిన్ డెంగీఆల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ కంపెనీ ఫేజ్3 ట్రయల్ పూర్తికావొస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ ఈ ఏడాదిలో విడుదలయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో