బొగ్గు నుంచి గ్యాస్!
ABN , Publish Date - May 14 , 2026 | 05:39 AM
పశ్చిమాసియా పరిణామాలతో సహజవాయువు, ఎల్పీజీ, యూరియాకు కొరత ఏర్పడిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. దేశంలో భారీ స్థాయిలో ఉన్న బొగ్గు...
భారీగా ‘కోల్ గ్యాసిఫికేషన్’ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ, మే 13: పశ్చిమాసియా పరిణామాలతో సహజవాయువు, ఎల్పీజీ, యూరియాకు కొరత ఏర్పడిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. దేశంలో భారీ స్థాయిలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వినియోగించుకుని ‘సిన్ గ్యాస్’ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. సహజవాయువుకు బదులుగా ‘సిన్ గ్యాస్’ను ఉపయోగించి.. ప్రత్యేక ప్రక్రియల ద్వారా యూరియా, మెథనాల్, హైడ్రోజన్, డీజిల్, పెట్రోల్, ఇతర హైడ్రోకార్బన్ రసాయనాలను ఉత్పత్తి చేయడానికి వీలుంటుంది. ఈ సిన్‌గ్యా్‌స ఉత్పత్తి కోసం ‘కోల్ గ్యాసిఫికేషన్’ ప్లాంట్లను భారీగా ఏర్పాటు చేయాలని.. ఇందుకోసం రూ.37,500 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దేశీయంగానే యూరియా, మెథనాల్‌తోపాటు ఇతర రసాయనాల ఉత్పత్తిద్వారా దిగుమతుల భారం తగ్గి, గణనీయంగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని కేంద్రం భావిస్తోంది. ‘‘ఏటా 7.5 కోట్ల టన్నుల బొగ్గును గ్యాస్‌గా మార్చేందుకు వీలుగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం సుమారు 3 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమని అంచనా. మన దేశంలో ఇప్పటివరకు గుర్తించిన బొగ్గు నిల్వలు సుమారు 40వేల కోట్ల టన్నులకుపైనే ఉన్నాయి. ఇవి మనకు 200 ఏళ్లకు సరిపోతాయి’’ అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాల్లో 50శాతానికిపైగా ఎల్‌ఎన్‌జీ, 80-90శాతం మెథనాల్‌ను, మొత్తంగా 100శాతం అమ్మోనియా, చాలా వరకు యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్‌తో దేశీయంగా వీటి ఉత్పత్తి పెరిగి, దిగుమతులు తగ్గుతాయని తెలిపారు. 2024-25లో మన దేశం ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమ్మోనియం నైట్రైట్, అమ్మోనియా, మెథనాల్, డైమిథైల్ ఈథర్, ఇతర పెట్రోరసాయనాల దిగుమతి కోసం ఏకంగా రూ. 2.77 లక్షల కోట్లు వెచ్చించింది. కాగా ‘కోల్ గ్యాసిఫికేషన్’ పథకం కింద ఒక్కో ప్లాంటు ఏర్పాటుకు వ్యయంలో గరిష్ఠంగా 20శాతం (రూ.5 వేల కోట్ల వరకు) ప్రోత్సాహకంగా అందిస్తారని కేంద్రం వెల్లడించింది.
కోల్ గ్యాసిఫికేషన్ ఇలా..
ఘన స్థితిలో ఉన్న బొగ్గును సింథటిక్ గ్యాస్ (సిన్ గ్యాస్)గా మార్చే ప్రక్రియే కోల్ గ్యాసిఫికేషన్. ప్రత్యేకమైన చాంబర్‌లో ఉంచిన బొగ్గుపైకి నీటి ఆవిరిని, గాలిని పంపుతూ, సుమారు 1,400 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. ఈ క్రమంలో బొగ్గు విపరీతంగా వేడెక్కి.. నీటి ఆవిరి, ఆక్సిజన్‌లతో రసాయన చర్యలు జరుపుతుంది. ఈ ప్రక్రియలో హైడ్రోజన్, మిథేన్, కార్బన్ మోనాక్సైడ్‌లతో కూడిన సిన్‌గ్యా్‌స ఉత్పత్తి అవుతుంది. సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ/సీఎన్‌జీ)ని ఉపయోగించి ఉత్పత్తి చేసే యూరియా, అమ్మోనియా ఎరువులు, మెథనాల్‌తోపాటు వివిధ ప్రక్రియల ద్వారా డీజిల్, పెట్రోల్, ఇతర రసాయనాలు వంటి చాలా రకాల హైడ్రోకార్బన్ పదార్థాలను సిన్‌గ్యా్‌సతో ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాదు ప్రత్యేక ప్రక్రియ ద్వారా సిన్‌గ్యా్‌సను శుద్ధి చేస్తే.. సహజవాయువు తరహాలో ‘కృత్రిమ సహజవాయువు’నూ ఉత్పత్తి చేయవచ్చు
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్