ఢిల్లీ నుంచి గల్లీదాకా..సమరమే
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:28 AM
ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తాము చేస్తున్న పోరాటాన్ని.. ఒక తార్కిక ముగింపునకు వచ్చే వరకూ కొనసాగించాలని ఇండి కూటమి నిర్ణయించింది.

ఓట్‌చోరీ వ్యతిరేక నిరసనలను రాష్ట్రాలకూ విస్తరిద్దాం
ఇండి కూటమి భేటీలో నిర్ణయం..
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో బహిరంగ సభలు
లక్ష్యాన్ని సాధించేదాకా పోరు: రాహుల్..
దసరా తర్వాత హైదరాబాద్‌లో సభ
మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్.. 25-26 తేదీల్లో సభ జరిగే చాన్స్!
న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తాము చేస్తున్న పోరాటాన్ని.. ఒక తార్కిక ముగింపునకు వచ్చే వరకూ కొనసాగించాలని ఇండి కూటమి నిర్ణయించింది. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకూ దేశ రాజధానిలో పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఆ కూటమి.. తమ కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రాలకు కూడా విస్తరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. మంగళవారం ఇక్కడ రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో.. ఇండి కూటమి నేతలు, విద్యార్థి నాయకులు, పౌర సమాజానికి చెందిన నేతలు పాల్గొని, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్దఎత్తున నిర్వహించిన నిరసన ప్రదర్శన ఘన విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను, అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిశ్చయించారు. ఆందోళనలను రాష్ట్రాలకు విస్తరించే ప్రణాళికలో భాగంగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఇండి కూటమి నేతలతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు కూడా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా దసరా పండుగ తర్వాత హైదరాబాద్ వేదికగా భారీ మార్చ్, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సభ నిర్వహణ తేదీ, ఇతర వివరాలను ఇండి కూటమి అగ్రనేతలు త్వరలోనే ఖరారు చేస్తారని చెప్పారు. అయితే.. ఈ నెల 25-26 తేదీల్లో ఆ సభను నిర్వహించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా.. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. తమ లక్ష్యాన్ని సాధించేంతవరకూ తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కాపాడేందుకు అవసరమైన అన్ని పోరాటాలనూ విస్తృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు వేదికైన జంతర్ మంతర్‌ను నిరసన, ప్రదర్శనలు నిర్వహించకుండా నిషేధించడం వల్ల సమస్య తీవ్రతరం అవుతుందని, ప్రభుత్వానికి గడ్డు రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఎన్నికల వ్యవస్థను కుప్పకూల్చాలన్న ప్రధాన ఆలోచన నరేంద్రమోదీది అయితే దానిని అమలు చేసే నేత అమిత్ షా అని రాహుల్ ఆరోపించారు. తమ చుట్టూ వల బిగుస్తోందనే విషయాన్ని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తదితరులు గ్రహించారని తెలిపారు.
భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేసిన వారు తప్పించుకోలేరని హెచ్చరించారు. ఢిల్లీ ఛలో పేరుతో తాము జరిపిన ఊరేగింపు మొత్తం దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని రాహుల్ పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేని సగటు మానవుని ఆలోచన ఈ నిరసన ప్రదర్శనలో వ్యక్తీకృతమైందన్నారు. సుప్రీంకోర్టు పట్ల, న్యాయవ్యవస్థ పట్ల ప్రతిపక్షానికి ఎంతో గౌరవం ఉందని, అది తనపాత్రను తాను పోషిస్తుందనే విశ్వాసం తమకు ఉందని రాహుల్ పేర్కొన్నారు. మోదీ ఓట్ చోరీ గురించి ప్రజలకు తెలిసిపోయిందని.. ఏం జరిగినా ప్రజల ప్రతిఘటన ఆగదని, అంతిమ విజయం ప్రజలదేనని చెప్పారు. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సూలే, సంజయ్ రౌత్, డి.రాజా, తెలంగాణ, కర్ణాటక సీఎంలు రేవంత్, డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, తెలంగాణ మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణా రావు, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్.రఘురాం రెడ్డి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక