ఢిల్లీ.. దద్దరిల్లె..
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:38 AM
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వరుసగా రెండోరోజైన బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్షాలు కదం తొక్కాయి. ఇండియా కూటమి ఎంపీలు, నాయకుల నిరసన, బైఠాయింపు, నినాదాలు, పోలీసుల నిర్బంధం, అరెస్టులతో ఢిల్లీ మళ్లీ దద్దరిల్లింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.

వరుసగా రెండో రోజూ ఇండి కూటమి ఎంపీల నిరసన
సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్
ఓ హోటల్‌లో భోజనానికి ఎంపీలకు ఖర్గే ఆహ్వానం
లంచ్ తర్వాత బస్సుల్లో జంతర్‌మంతర్‌వైపు కదిలిన నేతలు
అడ్డుకున్న పోలీసులు, భారీగా బలగాల మోహరింపు
బైఠాయించినరాహుల్ గాంధీ, ఇతర ఎంపీలు
రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపిన ప్రియాంక
విపక్ష నేతలను ఈడ్చుకెళ్లి, బస్సుల్లో తరలించిన పోలీసులు
నరేంద్ర మోదీ, అమిత్ షాలు మా పోరాటాన్ని ఆపలేరు
ఎఫ్‌ఐఆర్‌లు నాకు మెడల్స్ వంటివి: రాహుల్ గాంధీ
రాజ్యాంగ పరిరక్షణకు ప్రాణత్యాగానికైనా సిద్ధం: ప్రియాంక
నేడు ఢిల్లీలో భారీ నిరసనలకు ఇండి కూటమి ప్రణాళిక
న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వరుసగా రెండోరోజైన బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్షాలు కదం తొక్కాయి. ఇండియా కూటమి ఎంపీలు, నాయకుల నిరసన, బైఠాయింపు, నినాదాలు, పోలీసుల నిర్బంధం, అరెస్టులతో ఢిల్లీ మళ్లీ దద్దరిల్లింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. వారిని, ఇతర నాయకులను పోలీసులు బలవంతంగా బస్సుల్లో తరలించారు. కొన్ని గంటలపాటు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి రాత్రి 8 గంటల సమయంలో విడిచిపెట్టారు.
మంగళవారం ఎన్నికల సంఘం కార్యాలయ ముట్టడి యత్నం, అరెస్టుల పర్వం అనంతరం బుధవారం కూడా ఇండియా కూటమి ఆందోళనను కొనసాగించింది. అయితే, ఇది ముందస్తుగా ప్రకటించకుండా ఆకస్మికంగా జరగడం విశేషం. మధ్యాహ్న భోజనానికి సెంట్రల్ ఢిల్లీ జన్‌పథ్‌లోని ‘సాగర్ రత్న హోటల్’కు రావాలని ఇండియా కూటమి ఎంపీలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. లంచ్ మీటింగ్ అనుకొని మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయానికి ఎంపీలు భారీసంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. తొలుత దీని గురించి తెలియని పోలీసులు.. ఎంపీల చేరికతో అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున బలగాలు హోటల్ వద్దకు చేరుకున్నాయి. ఎంపీలు భోజనం చేసి హోటల్ నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయటకు రావటం ప్రారంభించారు. ఈలోపే అక్కడికి మూడు బస్సులు వచ్చాయి. రాహుల్, ప్రియాంక సహా ఎంపీలు అందరూ వచ్చి ఆ బస్సుల్లో ఎక్కారు. అక్కడి నుంచి జంతర్ మంతర్ దిశగా బస్సులు బయల్దేరాయి. అక్కడికి వెళ్లి నిరసన తెలపాలన్నది ఎంపీల వ్యూహం. కాంగ్రెస్ నేతలు అమరీందర్‌సింగ్, ఇమ్రాన్ మసూద్, దీపేందర్ హుడా, బీవీ శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నేతలు బస్సులపై ఎక్కి త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు.
అడ్డుకున్న పోలీసులు
బస్సులను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటం మొదలుపెట్టారు. ఆ మార్గంలో ఉన్న అశోకా రోడ్డు, టాల్‌స్టాయ్ లేన్ తదితర ప్రాంతాలలో పలు అంచెల బారికేడ్లు, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. పోలీసుల ఆంక్షలను దాటుకుంటూనే ఎంపీల బస్సులు శాంగ్రిలా హోటల్ వద్దకు చేరుకున్నాయి. సాగర్ రత్న హోటల్ నుంచి ఇక్కడికి ఉన్న దూరం కిలోమీటరున్నర మాత్రమేగానీ.. అక్కడికి బస్సులు రావటానికి రెండుగంటలకుపైగా సమయం పట్టింది. అక్కడ పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జంతర్ మంతర్ వద్ద నిరసనలకు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని, సెంట్రల్ విస్టా పరిసరాల్లో ధర్నాలు నిషేధమని పోలీసులు నేతలకు తెలియజేశారు. దీంతో రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఎంపీలు, నేతలు, కార్యకర్తలు బస్సులు దిగి.. అక్కడికి ఒక కి.మీ. దూరం ఉన్న జంతర్‌మంతర్ దిశగా నడుచుకుంటూ వెళ్లటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు అధికారులపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగగా.. ప్రియాంక గాంధీ రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపారు. చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని నినాదాలు చేశారు. ఆమెకు సంఘీభావంగా పలువురు మహిళా నేతలు కూడా రోడ్డు మీదే కూర్చున్నారు. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసేంతవరకూ తమ నిరసన అగబోదని, దేశంలోనే అత్యంత పవిత్రమైన రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటమని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమను మోదీ, అమిత్‌షా ఆపలేరని చెప్పారు. పోలీసులు పలువురు నేతలు, కార్యకర్తలు, ఎంపీలను బలవంతంగా ఈడ్చుకెళ్లి బస్సులు, వ్యాన్లలోకి ఎక్కించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సుమారు గంటసేపు రోడ్డుపైనే ఉండి నిరసన తెలిపారు. ప్రతిపక్షాలను సీఈసీ ఎందుకు కలవరో చెప్పాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో తొలుత రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా మోసుకెళ్లి పోలీస్ వ్యాను ఎక్కించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీని కూడా ఓ బస్సులోకి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి.
ప్రాణార్పణకైనా సిద్ధం: ప్రియాంక
పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ప్రియాంక గాంధీ గట్టిగా నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం ప్రాణాలు అర్పించటానికైనా తాము సిద్ధమని చెప్పారు. ఎన్నికల కమిషనర్లను కలవాలనుకుంటున్న ఎంపీల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఎంపీలను కొడుతున్నారని ఆరోపించారు. పోలీసులు తనను గోళ్లతో రక్కారని, పలుచోట్ల గాట్లు పడ్డాయని ప్రియాంక తెలిపారు. కాగా, రాహుల్‌గాంధీని తరలిస్తున్న బస్సు టైర్ పంచరు కావటంతో, ఆయనను మరో వాహనంలో పోలీసులు తరలించారు. బస్సు టైర్‌ను పంచర్ చేసింది తమ యోధులైన కార్యకర్తలేనని కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న నేతలను ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియానికి, బారకంభా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8 గంటల సమయంలో విడుదల చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, ఆర్ రఘురాం రెడ్డి, గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బస్సు ఎక్కి నిరసన తెలిపారు. తృణమూల్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంల్ తదితర పార్టీల నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత, కేరళ ముఖ్యమంత్రి సతీశన్ కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అకస్మాత్తుగా నిర్ణయించటంతో.. ఎస్పీ, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(ఎస్పీ) పార్టీల ఎంపీలు రాలేకపోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఢిల్లీలో జరిగిన నిరసనలపై పోలీసుల ఆంక్షల నేపథ్యంలో అక్టోబరు 7వ తేదీని భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డేగా కాంగ్రెస్ ప్రకటించింది. గురువారం దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టాలని అన్ని రాష్ట్ర, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను ఏఐసీసీ ఆదేశించింది.
వెనకడుగు వేయబోం: ఖర్గే
అరెస్టులు, పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. ‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రోడ్డెక్కడం, అరెస్టవడం, కేసులు ఎదుర్కోవం.. వీటన్నింటికీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య ఉన్న పొత్తు బట్టబయలైందని ఆరోపించారు. అహంకారంతో అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వం ప్రజల సంకల్పం ముందు ఎక్కువ కాలం నిలవదని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలటాన్ని చూస్తున్నామని, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని అరెస్టు చేయటం కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వానికి హాబీగా మారిందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ దుయ్యబట్టారు.
నేడు మరింత
భారీ నిరసనకు ప్రణాళిక!
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. జంతర్‌మంతర్‌కు వెళ్లకుండా బుధవారం పోలీసుల ఆంక్షలు, అరెస్టుల నేపథ్యంలో.. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచన జరిపారు. గురువారం మరింత పెద్ద ఎత్తున నిరసనలు జరపాలని నిర్ణయించారు. దీంట్లో కూటమికి చెందిన ఎంపీలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, 15 మందితో కూడిన ప్రతిపక్ష నేతల బృందం రాష్ట్రపతి ముర్మును కలవటానికి అపాయింట్‌మెంట్ కోరామని, 10 మందికి అనుమతి ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలిసే బృందంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఉంటారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.