Share News

నేడు ఇండీ కూటమి జన్‌బంధన్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:18 AM

కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి సోమవారం ‘ఇండియా జన్‌బంధన్‌’ పేరుతో కీలక సమావేశం నిర్వహించనుంది. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించే ఈ సమావేశానికి 23 రాజకీయ పార్టీలకు...

నేడు ఇండీ కూటమి జన్‌బంధన్‌

కాంగ్రెస్‌ నేతృత్వంలో ఢిల్లీలో మిత్రపక్షాల కీలక సమావేశం

23 పార్టీలు వస్తాయి: జైరాం

  • 2029 ఎన్నికలపై ప్రధాన దృష్టి

  • ఉమ్మడి వ్యూహంపై నేతల కసరత్తు

  • డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ దూరం

న్యూఢిల్లీ, జూన్‌ 7: కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి సోమవారం ‘ఇండియా జన్‌బంధన్‌’ పేరుతో కీలక సమావేశం నిర్వహించనుంది. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించే ఈ సమావేశానికి 23 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. విపక్షాల కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అయితే, కొన్ని పార్టీలు మాత్రం ఈ సమావేశానికి రావడం లేదని, వ్యక్తిగత కారణాలతో హాజరు కావడం లేదని సమాచారం ఇచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అన్ని విపక్ష పార్టీలు తీవ్ర ఆవేదనతో ఉన్నాయన్నారు. ‘‘భారత దేశం మాదిరిగా.. ‘ఇండియా జన్‌బంధన్‌’ తన వైవిధ్యంతో ఐక్యంగా ఉంది.’’ అని సోషల్‌ మీడియాలో ఆయన పోస్టు చేశారు. జైరాం రమేశ్‌ పోస్టును ట్యాగ్‌ చేసిన టీఎంసీ ఎంపీ డెరక్‌ ఒబ్రెయిన్‌.. ‘‘ఇండియా ఐక్యంగా ఉంది. ఒకే లక్ష్యం. స్పష్టమైన ఉద్దేశం ఉంది. అన్నిపార్టీలూ ఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నాయి’’ అన్నారు.

ఉమ్మడి వ్యూహం..

ఇండియా జన్‌బంధన్‌ సమావేశం ప్రధానంగా 2029 సార్వత్రక ఎన్నికలపైనే దృష్టి పెట్టనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ వైఫల్యాలు, జాతీయ అంశాలపై చర్చించి, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళనాట డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వాలు కుప్పకూలిన దరిమిలా ఇండీ మిత్రపక్షాల ఐక్యతను కొనసాగించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి డీఎంకే హాజరు కావడం లేదు. తమిళనాడులో కాంగ్రెస్‌ ఏకపక్షంగా టీవీకేకు మద్దతివ్వడమే ఇందుకు కారణం. మరోవైపు, ఆమ్‌ ఆద్మీపార్టీ ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నట్టు బహిరంగంగానే ప్రకటించింది. కాగా, జన్‌బంధన్‌ సమావేశం కోసం మమత ఆదివారమే కోల్‌కతా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.


మమతకు కీలకం!

తాజాగా నిర్వహించనున్న ఇండియా జన్‌బంధన్‌ సమావేశానికి తటస్థ వేదికను ఎంచుకున్నారు. గతంలో జరిగిన రెండు సమావేశాలు.. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ నివాసాల్లో జరిగాయి. అయితే.. ఈ సారి ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే.. మమతా బెనర్జీకి ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. అసెంబ్లీల్లో ఎన్నికల్లో ఓడిపోయిన దరిమిలా.. కేంద్రంపై పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె దృష్టి అసెంబ్లీపై లేదని.. పార్లమెంటుపైనే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బసిరహత్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తే.. కాంగ్రెస్‌ మద్దతు అవసరమవుతుంది. ఇదేసమయంలో కమ్యూనిస్టుల దన్ను కూడా అవసరమే. కానీ, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న మమత.. ఇండియా బ్లాక్‌ ద్వారా సాయం పొందాలని చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 06:18 AM