Share News

వెట్టిచాకిరీతో తయారు చేసిన ఉత్పత్తులపై భారత్ నిషేధం!

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:17 PM

ఇతర దేశాలతో వాణిజ్యంలో నైతికతకు పెద్దపీట వేస్తూ భారత్ తాజాగా నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసింది. వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

వెట్టిచాకిరీతో తయారు చేసిన ఉత్పత్తులపై భారత్ నిషేధం!
India forced labour imports

ఇంటర్నెట్ డెస్క్: ఇతర దేశాలతో వాణిజ్యంలో నైతికతకు పెద్దపీట వేస్తూ భారత్ తాజాగా నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసింది. వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల శ్రమ దోపిడీతో ముడిపడ్డ ఉత్పత్తులు, సేవలు ఏవీ దేశంలోకి దిగుమతి కాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాణిజ్య శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్మిక హక్కుల పరిరక్షణ దిశగా అమలవుతున్న అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా భారత్ కూడా దిగుమతుల నిబంధనల్లో ఈ మార్పులు తీసుకొచ్చింది.

వాణిజ్య శాఖ తన నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ఏ ఉత్పత్తి లేదా దేశం పేరును ప్రస్తావించలేదు. అయితే, వెట్టిచాకిరీతో ముడిపడ్డ ఎలాంటి ఉత్పత్తినైనా నిషేధించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిర్యాదులు వచ్చినప్పుడు దర్యాప్తు నిర్వహించి సంబంధిత వస్తువుల దిగుమతిని నిషేధిస్తామని వెల్లడించింది. న్యాయసమ్మతమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. తాజా నిబంధనల నేపథ్యంలో విదేశీ వస్తువుల దిగుమతి విషయంలో భారతీయ సంస్థలు మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.


వెట్టిచాకిరీతో ఉత్పత్తి అయిన వస్తుసేవలకు అడ్డుకట్ట వేయడంలో భారత్ విఫలమైందని ఆరోపిస్తూ ఆమెరికా ఇటీవల భారతీయ దిగుమతులపై 12.5 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా అన్ని దేశాలపైనా 10 శాతం సుంకం విధిస్తోంది. దీనికి తోడు వెట్టిచాకిరినీ అడ్డుకోలేకపోయారని ఆరోపిస్తూ పలు దేశాలపై అదనపు సుంకాలు విధించింది. అలాగే అమెరికాకు ఎగుమతుల పేరిట డంపింగ్‌కు పాల్పడుతున్న దేశాలపై కూడా విచారణ చేస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

రైల్లో మంగళసూత్రం చోరీ.. దంపతులకు రూ.70 వేల పరిహారం

కోర్టుకే అబద్ధాలు చెబుతారా.. కమెడియన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు..

Updated Date - Jul 14 , 2026 | 06:31 PM