రైల్లో మంగళసూత్రం చోరీ.. దంపతులకు రూ.70 వేల పరిహారం
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:40 PM
రైలు ఏసీ బోగీలో మంగళసూత్రం చోరీ అయిన ఘటనలో ఓ జంటకు నార్తర్న్ రైల్వే రూ.70 వేల పరిహారం చెల్లించాలని పంజాబ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: రైలు ఏసీ బోగీలో మంగళసూత్రం చోరీ అయిన ఘటనలో ఓ జంటకు నార్తర్న్ రైల్వే రూ.70 వేల పరిహారం చెల్లించాలని పంజాబ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. వారికి మానసిక వేదన కలిగినందుకు గాను మరో రూ.10 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ ఉదంతంలో రైల్వే సేవా లోపం ఉందని కమిషన్ ప్రెసిడెంట్, సభ్యుడు తెలిపారు.
2021లో దిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వెళుతుండగా ఈ చోరీ జరిగిందని బాధిత దంపతులు ఫిర్యాదు చేశారు. రూ.65 వేల విలువగల15 గ్రాముల బంగారు మంగళసూత్రం, రూ.5 వేల నగదు, బ్యాంకు పాస్‌బుక్ ఉన్న తమ హ్యాండ్ బ్యాగ్ పోయిందని ఆ దంపతులు ఫిర్యాదు చేశారు. బ్యాగ్ పోయిన వెంటనే ఫిర్యాదు చేసేందుకు కోచ్ అటెండెంట్ కోసం వెతికినప్పటికీ అతడి జాడ కనిపించలేదని అన్నారు. చివరకు ఆర్‌పీఎఫ్ సిబ్బందికి, టీటీఈకి సమాచారం అందించామని చెప్పారు. న్యూఢిల్లీలో జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని తెలిపారు. ఈ ఉదంతంలో రైల్వే సేవాలోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించాయని వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వాదనలను రైల్వే తోసిపుచ్చింది. కేసును కొట్టేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.
వినియోగదారుల కమిషన్ మాత్రం ప్రయాణికుల వాదనలతో ఏకీభవించింది. రైల్వే సమర్పించిన డాక్యుమెంట్లలోనే పరస్పర వాదనలు ఉన్నాయని పేర్కొంది. కోచ్ అటెండెంట్‌కు సంబంధించి డ్యూటీ రోస్టర్‌ను సమర్పించడంలో రైల్వే విఫలమైందని పేర్కొంది. ఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు అందినట్టు ఒకసారి అంగీకరించాక మళ్లీ ఫిర్యాదుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రైల్వే అనడం సబబు కాదని పేర్కొంది. ఈ ఉదంతంలో బాధిత జంటకు రూ.70 వేల పరిహారంతో పాటు వారికి మానసిక వేదన కలిగినందుకు గాను మరో రూ.10 వేలు చెల్లించాలని నార్తర్న్ రైల్వేను ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
మోదీజీ.. కేతన్‌ను హత్య చేసిన వారిని వదిలిపెట్టొద్దు.. రాఖీ అగర్వాల్ భావోద్వేగ లేఖ..
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!