దేశంలో ఇంధన కొరత లేదు
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:20 AM
దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత లేదని, వీటి సరఫరా పూర్తిగా నియంత్రణలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే నాలుగు భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయని.....
ఇప్పటికే 4 భారతీయ నౌకలు హోర్ముజ్‌ను దాటాయి
త్వరలో మరిన్ని నౌకలు రాబోతున్నాయి
అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి
పార్లమెంటులో సమగ్రంగా చర్చించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత లేదని, వీటి సరఫరా పూర్తిగా నియంత్రణలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే నాలుగు భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయని, త్వరలో మరిన్ని నౌకలు రాబోతున్నాయని పేర్కొంది. ఇతర దేశాల నౌకలు ఆ మార్గాన్ని దాటలేని క్షిష్ట పరిస్థితుల్లో.. ఇది భారత్‌కు విజయమని అభివర్ణించింది. పశ్చిమాసియా పరిస్థితిపై కేంద్రం బుధవారం సాయంత్రం పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం చేసిన కార్యాచరణను ప్రభుత్వం వివరించింది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సామాన్యులపై ఎలాంటి భారం పడకుండా చూస్తామని భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లాగా భారత్ దళారీ (మధ్యవర్తిత్వం చేసే) దేశం కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడంలో పాకిస్థాన్ పాత్రపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలను ఎంతో చురుగ్గా చేస్తోందన్నారు. ఇంధనం, ఎరువులు, సరుకులకు ఎలాంటి ఇబ్బందీలేదని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. కాగా, దేశంలో ఇంధన పరిస్థితి స్థిరంగానే ఉందన్న ప్రభుత్వ వివరణతో తాము ఏకీభవించడం లేదని కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటు ఉభయసభల్లోనూ సమగ్ర చర్చ జరగాలని, కానీ ఈ అంశంపై ప్రభుత్వం సరైన హామీ ఇవ్వలేదని చెప్పారు.
ఆ ప్రచారాలు నమ్మొద్దు: చమురు సంస్థలు
దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత లేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) బుధవారం ప్రకటించాయి. తమ పరిధిలోని పెట్రోల్ బంకులు ఎప్పటిలాగే సాఫీగా పనిచేస్తున్నాయని, కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించాయి. ప్రజలు ఆందోళనతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని అతిగా కొనుగోలు చేయవద్దని కోరాయి.
హోటళ్లలో ఎల్పీజీ చార్జీలు వేస్తే కఠిన చర్యలు
వంటగ్యాస్ కొరత పేరుతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై ఎల్పీజీ చార్జీలు విధించటం చట్ట వ్యతిరేకమని కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) ప్రకటించింది. ఇలాంటి చార్జీలు విధించే హోటళ్లపై వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెనూలో ప్రచురించిన ధరల ప్రకారమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
పీఎన్‌జీకి మారకుంటే సిలిండర్లు కట్
గృహ వినియోగదారులకు 3 నెలల గడువు: కేంద్రం
పశ్చిమాసియాలో యుద్ధంతో ఎల్పీజీ సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ వేగవంతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పైపుడ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) అందుబాటులో ఉన్న చోట్ల 3 నెలల్లోపు దానికి మారకుంటే గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. పైప్‌లైన్ గ్యాస్ అందుబాటులో ఉన్న చోట్ల, అధికారులు ఆ సమాచారం ఇచ్చిన తర్వాత కూడా గృహ వినియోగదారులు మూడు నెలల్లోగా ఆ సదుపాయాన్ని ఎంపిక చేసుకోకపోతే నోటీసులు ఇచ్చి తర్వాత ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తారు. పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వడంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే ఎల్పీజీ సిలిండర్ల సరఫరా కొనసాగిస్తారు. దీనికి సంబంధిత అధికారి నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. పీఎన్‌జీ అయితే పైప్‌లైన్ ద్వారా నేరుగా వంటగదిలోకే వస్తుంది. పైప్‌లైన్ గ్యాస్ అనుమతులను వేగవంతం చేయడానికి, స్థిరమైన చార్జీలు ఉండేలా కూడా ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం కింద ఆ ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. పైప్‌లైన్ కనెక్షన్ కోసం నిర్ణీత కాలపరిమితిలోపు అధికారులు అన్ని అనుమతులూ ఇవ్వాలి. వారు విఫలమైతే అనుమతులు ఇచ్చినట్లే భావించాలి. అలాగే గృహ సముదాయాలకు పీఎన్‌జీ సౌకర్యాన్ని నియంత్రించే సంస్థలు 3 పనిదినాల్లో అనుమతులు ఇవ్వాలి. చిట్టచివరి పీఎన్‌జీ కనెక్షన్‌ను 48 గంటల్లో ఇవ్వాలి.