రూ.62,500 కోట్లతో ఎమ్‌పీఎమ్ఎస్ స్కీమ్.. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:30 PM
దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ బుధవారం మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ బుధవారం మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.62,500 కోట్లను కేటాయించింది.
ఎమ్‌పీఎమ్ఎస్ స్కీమ్ వివరాలు ఇవీ..
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం కేవలం ఫోన్ల అసెంబ్లీకే పరిమితం కాకుండా ప్రపంచస్థాయిలో పోటీ పడే భారతీయ మొబైల్ బ్రాండ్స్ అభివృద్ధి కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2026 మొదలు ఐదేళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. భారత్‌ను ప్రపంచ ఫోన్ తయారీలో ఒక ప్రధాన కేంద్రంగా నిలిపే లక్ష్యంతో కేంద్రం ఈ పథకం కింద దేశీయ పరిశ్రమలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
ఈ పథకం కింద ఎంపిక చేసిన ఫోన్ విక్రయాలపై 2.25 శాతం నుంచి 5 శాతం వరకూ సంస్థలకు నగదు రూపంలో ప్రోత్సాహకాలను కేంద్రం ఇవ్వనుంది. మొబైల్ ఫోన్స్‌లో వాడే పరికరాలను దేశీయంగా సేకరించే సంస్థలు, సబ్ అసెంబ్లీని దేశంలోనే చేపట్టే సంస్థలకు మరో 1.5 శాతం ఆర్థిక ప్రోత్సాహకాలు అందనున్నాయి. అంతేకాకుండా, ప్రాడక్ట్ రూపకల్పన, పరిశోధనపై ఖర్చు పెట్టే దేశీయ సంస్థలకు మరో 3 శాతం వరకూ ఆర్థిక ప్రోత్సాహకాలు లభించనున్నాయి.
ఆర్ అండ్ డీ కార్యకలాపాలను ప్రోత్సహించే ఈ పథకం దేశీయ మొబైల్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లల్లో 60 వేల ఉద్యోగాల కల్పన కూడా సాధ్యపడుతుందని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో భారత్ మంచి పురోగతి సాధించింది. 2014-15 కాలంలో దేశీయంగా రూ.18,900 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఉత్పత్తి కాగా 2025-26 నాటికి ఇది 6.25 లక్షల కోట్లకు చేరింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రాణాలు కాపాడమని వేడుకున్నా పట్టించుకోలేదు.. 40 నిమిషాల నిరీక్షణ చివరికి విషాదం
పీఓకేలో పతాకస్థాయికి ఉద్రిక్తతలు