ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో 100శాతం ఇథనాల్!
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:10 AM
పెట్రోల్ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కార్లు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి
ఈ100 ఇంధన వినియోగానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
మోటారు వాహన నిబంధనల్లో సవరణలు
ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలకే అనుమతి
న్యూఢిల్లీ, అక్టోబరు 26: పెట్రోల్ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కార్లు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ఈ100 ఇంధనం (100శాతం ఇథనాల్) వాడేందుకు అనుమతిస్తూ కేంద్ర రవాణా శాఖ సోమవారం మోటారు వాహన నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో అధిక ఇథనాల్ మిశ్రమాలతో నడిచే కార్ల తయారీ, ధ్రువీకరణకు చట్టపరంగా మార్గం సుగమం అయినట్లయింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ100 ఇంధనానికి అనుమతి లభించినంత మాత్రాన ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న అన్ని పెట్రోల్ కార్లలో ఈ ఇంధనాన్ని వాడేందుకు వీలుండదు. తయారీ సంస్థలు ప్రత్యేకంగా రూపొందించి, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లోనే ఈ100 లేదా ఈ85 ఇంధనాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ20 పెట్రోల్‌కు అనుగుణంగా ఉన్న కార్లలో, సాధారణ పెట్రోల్ వాహనాల్లో నేరుగా ఈ100 ఇంధనాన్ని నింపడానికి అనుమతి లేదు. అధిక ఇథనాల్ శాతాన్ని తట్టుకునేలా ఇంజన్, ఇంధన సరఫరా వ్యవస్థలను ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ఈ20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80శాతం పెట్రోల్ ఉంటాయి. తాజాగా నిబంధనల్లో చేసిన మార్పులతో ఈ85తోపాటు ఈ100 ఇంధనాన్నీ అధికారికంగా చేర్చారు. ఈ85లో 85శాతం ఇథనాల్, 15శాతం పెట్రోల్ ఉంటాయి. ఈ100లో దాదాపు పూర్తిగా ఇథనాలే ఇంధనంగా ఉంటుంది. కాగా, వాహనాల ఉద్గార ప్రమాణాలు, ఇంధన నిర్దేశాలు, పరీక్షా విధానాలకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు చేశారు. తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాల స్థూల బరువు పరిమితిని 3,000 నుంచి 3,500 కిలోలకు పెంచారు.
రంగంలోకి ఆటోమొబైల్ కంపెనీలు
అధిక ఇథనాల్ మిశ్రమాలతో నడిచే వాహనాల తయారీపై ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటికే దృష్టి సారించాయి. మారుతీ సుజుకీ ఈ ఏడాది జూన్‌లో ఈ20 నుంచి ఈ100 వరకు ఇంధన మిశ్రమాలతో నడిచే వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును పరిచయం చేసింది. టయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి సంస్థలు కూడా ఈ తరహా వాహనాల రూపకల్పనపై పనిచేస్తున్నాయి. చమురు దిగుమతుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అయితే, ఈ100 ఇంధనాన్ని వాణిజ్య స్థాయిలో ఎప్పటి నుంచి, ఏయే ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తారనే దానిపై తాజా ప్రకటనలో నిర్దిష్ట గడువు వెల్లడించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్