Share News

విమానాలకు గల్ఫ్‌ కష్టం

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:50 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన ఖర్చులు, తగ్గిన ఆదాయంతో దేశీయ విమానయాన రంగం కుదేలవుతోంది. భారత్‌ నుంచి గల్ఫ్‌తోపాటు అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలకు...

విమానాలకు గల్ఫ్‌ కష్టం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన ఖర్చులు, తగ్గిన ఆదాయంతో దేశీయ విమానయాన రంగం కుదేలవుతోంది. భారత్‌ నుంచి గల్ఫ్‌తోపాటు అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలకు వెళ్లే విమానాల రాకపోకలన్నీ గల్ఫ్‌, ఇరాన్‌, ఇరాక్‌ గగనతలం మీదుగా సాగుతాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత ఇరాన్‌ తన గగనతలాన్ని మూసేసింది. ఆపై, ఇరాక్‌ కూడా తన గగనతలాన్ని మూసేసింది. దీంతో గల్ఫ్‌ దేశాలకు, ఆ దేశాల మీదుగా అమెరికా, ఐరోపా వెళ్లే విమాన సర్వీసులను భారతీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తగ్గించేశాయి. కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపిస్తున్నాయి. దీని వల్ల దూరం పెరిగి అదనపు ఇంధనం అవసరమవుతోంది. అదనపు ఇంధన ట్యాంకు కోసం ప్రయాణికుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దీంతో విమానయాన సంస్థలు ఆదాయం కోల్పోతున్నాయి. మరోపక్క, ఏటీఎఫ్‌ ధరను భారీగా పెంచడం కూడా సమస్యగా మారింది. విదేశీ విమానయాన సంస్థలతోపాటు భారత్‌కు చెందిన నాన్‌ షెడ్యూల్డ్‌, చార్టెర్డ్‌, ప్రత్యేక విమానాలకు కిలో లీటరు ఏటీఎఫ్‌ ధరను రూ.2.7 లక్షలకు పెంచారు. ఇది అంతకుముందుతో పోలిస్తే 115ు ఎక్కువ. ఇప్పటికే గల్ఫ్‌ దేశాలతోపాటు ఇతర విదేశాలకు ఎయిరిండియా, ఇండిగో సహా ఇతర సంస్థలు నాన్‌ షెడ్యూల్డ్‌ విమానాలను నడుపుతున్నాయి. పెరిగిన ధరల భారం ఆయా విమానాల ప్రయాణికులపై పడుతోంది. వీటితోపాటు పతనమవుతున్న రూపాయి మారకం విలువ కూడా విమానయాన సంస్థలకు ఇబ్బందిగా మారింది. మరోపక్క, రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్‌లో కూడా భారీ వ్యత్యాసాల వల్ల ప్రయాణికులు టికెట్లకు చెల్లిస్తున్న మొత్తాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 06:04 AM