Share News

ఆ విమానం దగ్గరకు కూడా మమల్ని రానీయరు: భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:30 AM

ఎఫ్-35 యుద్ధ విమానాలను దగ్గర నుంచి చూసేందుకు కూడా అమెరికా తమను అనుమతించట్లేదని భారత వాయుసేనాధిపతి ఏపీ సింగ్ చురకలు అంటించారు. తరంగ్ శక్తి వైమానిక విన్యాసాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.

ఆ విమానం దగ్గరకు కూడా మమల్ని రానీయరు: భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్
Air chief Marshal AP Singh

ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా ప్రస్తుతం తరంగ్ శక్తి యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. జోధ్‌పూర్‌లో జరుగుతున్న (రాజస్థాన్) ఈ విన్యాసాల్లో అమెరికా తొలిసారిగా తన ఎఫ్-35 యుద్ధ విమానాలను ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎఫ్-35 విమానాన్ని దగ్గరి నుంచి చూసేందుకు అమెరికా అనుమతించట్లేదంటూ సరదాగా చురకలు అంటించారు. శనివారం ఓ పత్రికా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఎఫ్-35 విమానాలను అమెరికా భారత్‌కు విక్రయించేందుకు అంగీకరించిందా? అన్న ప్రశ్నకు ఆయన ఇలా చురకలంటించారు.

‘అసలు వాళ్లు మమల్ని ఎఫ్-35 దగ్గరకు కూడా వెళ్లనీయట్లేదు. మీరేమో ఎఫ్ -35 విక్రయాల గురించి మాట్లాడుతున్నారు’ అంటూ చురకలు అంటించారు. యూఎస్ పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ జనరల్ కెవిన్ ష్నైడర్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్-35 కాక్‌పిట్‌ను చూసే అవకాశం కూడా లేదని అన్నారు. అయితే, గగనతల విన్యాసాల సందర్భంగా ఎఫ్-35కి సమీపంలో భారత విమానాలు వెళ్లేందుకు మాత్రం అనుమతించారని చెప్పారు. దేశభద్రతకు కీలకమైన సాంకేతికతలను దేశాలు ఇలాగే కాపాడుకుంటాయని కూడా భారత వాయుసేనాధిపతి చెప్పారు.


ఈ కామెంట్స్‌పై యూఎస్ కమాండర్ జనరల్ ష్నైడర్ కూడా స్పందించారు. ఎఫ్-35పై నిర్ణయాలు తన పరిధిలో లేవని స్పష్టం చేశారు. ఈ సాంకేతికతకు సంబంధించి ఏ విషయాలను పంచుకోవాలి అనే అంశాలపై అత్యున్నత స్థాయిలో మార్గదర్శకాలు తయారవుతాయని చెప్పారు. ఇదిలా ఉంటే, రష్యా తన ఎస్‌యూ-57 జెట్‌ను భారత్‌కు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలిపారు. అయితే, ఈ విషయంలో భారత్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

ఐదోతరం అత్యాధునిక ఫైటర్ జెట్స్‌ను సమకూర్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం చేపట్టిన ఏఎమ్‌సీఏ ప్రాజెక్టు ఆశించిన ఫలితాన్ని ఇచ్చేందుకు మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. మరోవైపు చైనా ఇప్పటికే జే-20, జే-35 వంటి అత్యాధునిక ఐదో తరం ఫైటర్ జెట్స్‌ను సిద్ధం చేసుకుంది. వీటిలో కొన్నింటిని పాక్‌కు కూడా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తక్షణ అవసరాల కోసం ఎఫ్-35, ఎస్‌యూ-54 వంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్‌పై దష్టిసారించింది. సెప్టెంబర్ 26న మొదలైన తరంగ్ శక్తి విన్యాసాలు అక్టోబర్ 12 వరకూ జరగనున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..

మా విషయాల్లో జోక్యం వద్దు: ఐరాస మానవహక్కుల సంఘంపై భారత్ ఫైర్

Updated Date - Oct 11 , 2026 | 10:05 AM