వచ్చే నెలలో లోటు వర్షపాతమే.. భారత వాతావరణ శాఖ అంచనా
ABN , Publish Date - Jul 31 , 2026 | 07:19 PM
ఎల్‌నినో కారణంగా జూన్‌లో ముఖం చాటేసిన వానలు అనూహ్యంగా జులైలో పుంజుకున్నాయి. అయితే, ఆగస్టులో మాత్రం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో జులై నెలలో దాదాపు సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎల్‌నినో కారణంగా జూన్‌లో ముఖం చాటేసిన వానలు అనూహ్యంగా జులైలో పుంజుకున్నాయి. అయితే, వచ్చే నెలలో మాత్రం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆగస్టు నెల సగటు వర్షపాతం (లాంగ్ పీరియడ్ యావరేజ్) 254.9 మిల్లీమీటర్లు. అయితే, ఇందులో 94 శాతం వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ నెలలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఫలితంగా ఈ సీజన్ ద్వితీయార్థంలో దీర్ఘకాలిక సగటుకు 94 శాతం లోపే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. జాతీయ స్థాయిలో వర్షాభావం కనిపించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, మధ్య భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణ స్థాయి వరకూ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది.
మరింతగా బలపడనున్న ఎల్‌నినో..
ఇక రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపే ఎల్‌నినో తీవ్రత ఆగస్టులో ఓ మోస్తరు స్థాయిలోనే ఉండనుంది. సెప్టెంబర్‌లో మాత్రం మరింతగా బలపడి, వచ్చే ఏడాది ప్రారంభం వరకూ ఎల్‌నినో కొనసాగుతుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, హిందూమహాసముద్రంలో రుతుపవనాల అనుకూల పరిస్థితి ( పాజిటివ్ ఇండియన్ ఓషియన్ డైపోల్) ఏర్పడే అవకాశం ఉందని కూడా అంచనాలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ మాత్రం హిందూ మహాసముద్రంలో పరిస్థితులు తటస్థంగా ఉండొచ్చని భావిస్తోంది. రాబోయే నెలల్లో పరిస్థితిని బట్టి రుతుపవనాలపై క్లారిటీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
రూ.4.5 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం