కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇళయరాజా..
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:16 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇళయరాజా స్వరపరిచిన ప్రముఖ గీతం 'ఎన్ ఇనియా పొన్ నిలవే'కు సంబంధించిన కాపీరైట్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను స్వరపరిచిన ప్రముఖ గీతం 'ఎన్ ఇనియా పొన్ నిలవే'కు సంబంధించిన కాపీరైట్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన ప్రత్యేక అనుమతి పిటిషన్ (SLP) దాఖలు చేశారు. 'ఎన్ ఇనియా పొన్ నిలవే' పాటను మరో చిత్రంలో ఉపయోగించడంపై వివాదం మొదలైంది (Ilaiyaraaja Supreme Court).
'అఘాతీయా' చిత్రంలో ఈ పాటను కొత్తగా ఉపయోగించేందుకు ప్రయత్నించడంతో 'సారెగామా ఇండియా' అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై 2026 మేలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇళయరాజాకు పాటలోని సంగీత స్వరకల్పనపై హక్కు ఉన్నప్పటికీ, పాట సౌండ్ రికార్డింగ్, సాహిత్యంపై ఆయనకు కాపీరైట్ లేదని కోర్టు పేర్కొంది. సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించిన హక్కులు చిత్ర నిర్మాత నుంచి సారెగామాకు బదిలీ అయ్యాయని, కాబట్టి సదరు సంస్థ అనుమతి లేకుండా మరో చిత్రంలో ఉపయోగించడం కుదరదని కోర్టు అభిప్రాయపడింది (copyright dispute En Iniya Pon Nilave).
ఇళయరాజా వాదన ప్రకారం, తాను ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చినందున సంగీత కూర్పుపై తన కాపీరైట్ కొనసాగుతుందని పేర్కొన్నారు (Saregama Moodu Pani). ఆ సంగీతాన్ని కొత్త రూపంలో ఉపయోగించేందుకు ఇతరులకు అనుమతి ఇచ్చే హక్కు తనకు ఉందని ఆయన వాదిస్తున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు సంగీత కూర్పు, పాట సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌ను వేర్వేరు కాపీరైట్ అంశాలుగా పరిగణించింది. ఇళయరాజా హక్కులు ప్రధానంగా సంగీత కూర్పునకే పరిమితమని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై తాజాగా ఇళయారాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌పై చర్యలు.. ఉమ్మెత్త విక్రయాలపై సీరియస్
మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..