Share News

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రుల నిరాహార దీక్ష

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:02 PM

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులు గురువారం ముంబైలో నిరాహార దీక్ష చేపట్టారు.

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రుల నిరాహార దీక్ష
Sahil Wakode Parents' Hunger Strike

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులు గురువారం ముంబైలో నిరాహార దీక్ష చేపట్టారు. తమ తనయుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రవీంద్ర, సోనాలీ వాకోడే ఆజాద్ మైదాన్‌లో దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలంటూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు కూడా వినతి పత్రం అందజేశారు. ‘మా బిడ్డను టార్చర్ పెట్టిన వారు జైలుపాలు కావాలి. తాను కుల వివక్ష ఎదుర్కొన్నట్టు మా బిడ్డ చెప్పాడు’ అని రవీంద్ర అన్నారు.


బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ (22) సెప్టెంబర్ 18న తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాహిల్ ఆత్మహత్యతో వివాదం రేగుతుండటంతో సెప్టెంబర్ 26-27 తేదీల్లో జరగాల్సిన మిడ్ సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 10-11 తేదీలకు వాయిదా పడ్డాయి. సాహిల్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని కూడా ఐఐటీ బాంబే ఎక్స్ వేదికగా తెలిపింది. సాహిల్ ఆత్మహత్య ఘటన కేసులో ప్రొఫెసర్ సూర్యనారాయణ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. నిష్పాక్షిక దర్యాప్తు దిశగా ఆయనను సెలవుపై పంపించారు.


ఈ పరిణామాలు రాజకీయ నిరసనలకు కూడా దారి తీశాయి. కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్, పార్టీ వర్కర్లు, ఎన్ఎస్‌యూఐ యాక్టివిస్టులు, ఐఐటీ బాంబేలో నిరసన దిగారు. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గైక్వాడ్ సహా పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాహిల్ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదు: సుధాన్షు త్రివేది

లంచం డిమాండ్ చేశారని విషం తాగిన యువకుడు.. పంజాబ్‌ బర్నాలాలో ఘటన

Updated Date - Sep 24 , 2026 | 10:45 PM