Share News

హైదరాబాద్‌లోనూ..హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు 50శాతం

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:52 AM

హైదరాబాద్‌ మహా నగరం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు మూల వేతనంలో 40 శాతంగా ఉన్న హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ ...

హైదరాబాద్‌లోనూ..హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు 50శాతం

  • 40 శాతం నుంచి పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి20: హైదరాబాద్‌ మహా నగరం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు మూల వేతనంలో 40 శాతంగా ఉన్న హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) పన్ను మినహాయింపును 50 శాతానికి పెంచింది. హైదరాబాద్‌తోపాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు నగరాల్లో పనిచేస్తున్న వేతన జీవులకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును 50 శాతంగా నిర్ణయించింది. మిగతా ప్రాంతాల్లో పనిచేసేవారికి దీనిని 40 శాతంగా నిర్ధారించింది. ఈ మేరకు రూపొందించిన ఇన్‌కంట్యాక్స్‌ రూల్స్‌-2026ను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. గతంలో 50 శాతం మినహాయింపు ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ నగరాలకే పరిమితమై ఉండేది. ఆదాయ పన్ను చట్టం-1961ని సరళీకరిస్తూ కేంద్రం ఆదాయ పన్ను చట్టం -2025ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఇన్‌కంట్యాక్స్‌ రూల్స్‌-2026 పేరుతో గెజిట్‌లో ప్రకటించారు. శుక్రవారం సమావేశమైన ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ రూల్స్‌ను నోటిఫై చేసింది. ఇవి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగులు పన్ను మినహాయింపు కోసం సమర్పించే ఫామ్‌ 124లో హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపును 50 శాతం పొందవచ్చు. అయితే కొత్త ఆదాయ పన్ను నిబంధనల్లో కేంద్రం ఓ కొత్త షరతు విధించింది. హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు కోరే ఉద్యోగి.. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో తనకు ఉన్న సంబంధం గురించి విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. తమ తల్లి, తాత, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఉంటూ వారికి అద్దె చెల్లిస్తున్నట్లు ఐటీల్లో పేర్కొనే ఉద్యోగు కోసం ఈ నిబంధనను తెచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపులు, ఇతర అంశాలపై 150కి పైగా ఫామ్‌లను ప్రవేశపెట్టారు.

Updated Date - Mar 21 , 2026 | 03:52 AM