తండ్రిని హత్య చేసిన లేడీ పోలీస్.. మూడేళ్ల తర్వాత ఊహించని విధంగా..
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:52 PM
ప్రియుడి కోసం ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని కన్నతండ్రికి విషం ఇచ్చి చంపేసింది. అయితే, 3 ఏళ్ల తర్వాత విషయం బయటపడింది.
ముంబై, మార్చి 27: ప్రియుడి కోసం ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని కన్నతండ్రికి విషం ఇచ్చి చంపేసింది. అయితే, 3 ఏళ్ల తర్వాత విషయం బయటపడింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా జైలుపాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 2023, ఏప్రిల్ 25వ తేదీ ఉదయం మహారాష్ట్ర పోలీస్ శాఖలో పని చేస్తున్న పోలీస్ ఆఫీసర్ జయంత్ బల్లవర్ డ్యూటీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆయన కూతురు ఆర్య కూడా పోలీస్ శాఖలోనే పనిచేస్తోంది. తండ్రి డ్యూటీకి వెళ్లేముందు ఆర్య ఆయనకు మిల్క్‌షేక్ ఇచ్చింది.
మిల్క్‌షేక్ తాగి ఆయన డ్యూటీకి వెళ్లిపోయారు. చంద్రపూర్‌లోని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫీస్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలి చనిపోయారు. పోలీసులు అస్వస్థత కారణంగా ఆయన చనిపోయాడని తేలుస్తూ ఫైల్ క్లోజ్ చేశారు. 3 ఏళ్ల తర్వాత కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్య తన తండ్రికి విషం ఇచ్చి చంపిందంటూ ఆమె భర్త ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో జరిగిన విషయాలను పోలీసులకు వివరించి చెప్పాడు. ఆశిష్, ఆర్య ప్రేమించుకున్నారు. ఈ పెళ్లికి ఆర్య తండ్రి జయంత్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన అడ్డుతొలగించాలని ఆర్య, ఆశిష్ భావించారు.
ఆర్య తన కజిన్ చైతన్య అనే యువకుడితో విషం తెప్పించింది. ఆ విషాన్ని మిల్క్‌షేక్‌లో కలిపి డ్యూటీకి వెళుతున్న తండ్రికి ఇచ్చింది. విషం కలిపిన మిల్క్‌షేక్ తాగి ఆయన చనిపోయాడు. పోలీసులకు ఇది హత్య అన్న అనుమానం రాలేదు. కేసు క్లోజ్ చేశారు. ఆశిష్, ఆర్య పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆశిష్ తన చెడు ప్రవర్తన కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆర్య పుట్టింటికి వచ్చేసింది. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆశిష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జయంత్ హత్య గురించి చెప్పాడు. పోలీసులు ఆర్య, ఆశిష్, చైతన్యలను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
కాంట్రాక్టర్‌పై రెచ్చిపోయిన భూపాలపల్లి కలెక్టరేట్ ఉద్యోగి..
ఆ విషయంపై ఇరాన్ సీరియస్.. గల్ఫ్ దేశాలకు వార్నింగ్!