హాస్టల్‌లో యువకుడి దారుణం.. అర్ధరాత్రి అమ్మాయిల గదిలోకి చొరబడి..
ABN , Publish Date - May 22 , 2026 | 03:12 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. తనను పోలీసులకు పట్టించారన్న కోపంతో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలపై కక్ష గట్టాడు. వారు ఉంటున్న హాస్టల్ గదిలోకి చొరబడి దారుణంగా కొట్టాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: తనను పోలీసులకు పట్టించారన్న కోపంతో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలపై కక్ష గట్టాడు. వారు ఉంటున్న హాస్టల్ గదిలోకి చొరబడి దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శుభమ్ ద్వివేది తండ్రికి శివ్‌కుతిలోని శంకర్ ఘాట్ ఏరియాలో గర్ల్స్ హాస్టల్ ఉంది. శుభమ్ ఆ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలను గత కొంత కాలం నుంచి వేధిస్తున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి హింసిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే వారిద్దరూ శివ్‌కుతి పోలీస్ స్టేషన్‌లో శుభమ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేధింపులు నిజమని తేలటంతో అతడిని అరెస్ట్ చేశారు. తను అరెస్ట్ అవ్వడానికి కారణమైన అమ్మాయిలపై శుభమ్ కక్ష పెంచుకున్నాడు. 17వ తేదీ అతడు బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన రోజు రాత్రి రెండు గంటల సమయంలో పీకల దాకా మందు తాగి ఆ అమ్మాయిలకు కాల్స్, మెసెజ్‌లు చేశాడు. వారు వాటికి స్పందించకపోవటంతో శుభమ్ కోపం కట్టలు తెంచుకుంది.
నేరుగా హాస్టల్‌కు వెళ్లాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఉంటున్న గది తలుపులపై గట్టిగా కొట్టడం మొదలెట్టాడు. వారు డోర్ తెరవకపోవటంతో బయటినుంచి గడియ పెట్టేశాడు. బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో అమ్మాయిలు గట్టిగా అరవటం మొదలెట్టారు. కొద్దిసేపటి తర్వాత శుభమ్ తల్లి గది దగ్గరకు వచ్చింది. తల్లి రాగానే అతడు డోర్ ఓపెన్ చేశాడు. ఆ వెంటనే లోపలికి చొరబడి అలజడి సృష్టించాడు. వారిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ దగ్గరకు వచ్చారు. శుభమ్‌ను అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు.
ఇవి కూడా చదవండి
భారత్ ఎన్నటికీ తలవంచదు.. అమిత్‌షా
పెన్షన్లపై జగన్ అబద్ధపు ప్రచారాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్