Share News

గల్ఫ్ ఉద్రిక్తతలు! భారత్‌కు టెన్షన్ లేనట్టే

ABN , Publish Date - Mar 01 , 2026 | 10:15 PM

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఇది స్వల్పకాలికమేనన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో చమురు దిగుమతుల పరంగా భారత్‌కు టెన్షన్ లేనట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గల్ఫ్ ఉద్రిక్తతలు! భారత్‌కు టెన్షన్ లేనట్టే
Gulf Tensions- Crude Oil

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ ప్రాంతం రణరంగంగా మారడంతో ముడి చమురు, సహజ వాయువు రవాణాపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముడి చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసేశామని ఇరాన్ సైన్యం ప్రకటించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ పరిస్థితులతో భారత్‌కు తక్షణం కలిగే ఇబ్బంది ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. భారత్ వద్ద కనీసం పక్షం రోజులకు సరిపడా ఇంధన వనరులు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మీడియా కథనాల ప్రకారం, 10-15 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు భారత రిఫైనరీల వద్ద ఉన్నాయి. 7-10 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు కూడా ఉన్నాయి. అవసరం అనుకుంటే వ్యూహాత్మక ఇంధన నిల్వలను వాడుకోవచ్చు. వీటితో వారం రోజుల పాటు భారత దేశ అవసరాలను తీర్చుకోవచ్చు. అయితే, జలసంధి మూసివేత ఎక్కువ రోజుల పాటు కొనసాగదని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ అత్యవసర సందర్భాల కోసం ప్రణాళికలతో భారత్ సిద్ధంగా ఉంది.


దేశంలో వినియోగించే ముడి చమురులో 88 శాతం భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. 50 శాతం సహజ వాయువునూ దిగుమతి చేసుకుంటోంది. చమురు దిగుమతుల్లో 50 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే భారత్‌కు చేరతాయి. ఇక ఎల్ఎన్‌జీ దిగుమతుల్లో 60 శాతం కూడా ఇదే మార్గంలో దిగుమతి చేసుకుంటుంది. ఎల్‌పీజీ దిగుమతులూ దాదాపు పూర్తిగా ఇదే మార్గం మీదుగా భారత్‌కు చేరుకుంటాయి.

ఇక ఘర్షణలు ఎక్కువ రోజుల పాటు కొనసాగితే ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టిపెట్టే అవకాశం ఉంది. రష్యా, వెనెజువెలా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతులను పెంచే అవకాశం ఉంది. అయితే, ఇతర దేశాల నుంచి దిగుమతులకు దూరాభారం కారణంగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతులు భారత్‌కు చేరేందుకు ఐదు రోజులు పడితే రష్యా నుంచి వచ్చేందుకు దాదాపు నెల రోజుల వరకూ పట్టొచ్చు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో చమురు రవాణాకు తాత్కాలిక ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నా దీర్ఘకాలిక అవాంతరాలకు ఛాన్స్ తక్కువేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈ వార్తలూ చదవండి:

మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’

ట్రేడ్‌ డీల్‌ గురించి అడిగితే.. ఇజ్రాయెల్‌కు జారుకున్నారు: రాహుల్‌

Updated Date - Mar 01 , 2026 | 10:27 PM