కుంగుబాటులో ‘ఉన్నత’ విద్యార్థులు
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:51 AM
భవిష్యత్తు ఆశలతో ఉన్నత విద్యాసంస్థల్లో చేరుతున్న విద్యార్థుల్లో చాలామంది కుంగుబాటుకు, కొంతమందైతే ఆత్మహత్యా భావనకు గురి కావడం పట్ల సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం ఆందోళన వ్యక్తం చేసింది
9 శాతం మందిలో ఆత్మహత్యా భావనలు
సామాజిక, లైంగిక వివక్షలకు ఆలవాలంగా ఉన్నత విద్యా సంస్థలు
ప్రవేశాల్లో కులం చూస్తున్న మేనేజ్‌మెంట్లు
మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థినులకు ఫ్యాకల్టీ వేధింపులు
సుప్రీం నియమించిన టాస్క్‌ఫోర్స్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: భవిష్యత్తు ఆశలతో ఉన్నత విద్యాసంస్థల్లో చేరుతున్న విద్యార్థుల్లో చాలామంది కుంగుబాటుకు, కొంతమందైతే ఆత్మహత్యా భావనకు గురి కావడం పట్ల సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. తాము కుంగుబాటుకు గురయ్యామని ఈ సంస్థల్లో చదువుతున్నవారిలో 15ు మంది ఈ బృందానికి తెలపగా, 9ు మంది తమకు చనిపోవాలనే ఆలోచనలు కలుగుతున్నాయని వెల్లడించారు. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎదురవుతున్న మానసిక, ఇతర సమస్యలపై అధ్యయనం చేసేందుకు గతేడాది మార్చిలో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలోని ఈ టాస్క్‌ఫోర్స్ బృందం దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలను సందర్శించి ఒక నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను సుప్రీంకోర్టుకు వచ్చే నెల 31న సమర్పించనుంది. అయితే, ఆర్టీఐ పిటిషన్ ద్వారా ఆ నివేదికలోని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయనంలో భాగంగా 19 ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 2.43 లక్షలమందిని టాస్క్‌ఫోర్స్ కలిసింది.
టాస్క్‌ఫోర్స్ కలిసినవారిలో ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలకు చెందిన విద్యార్థులు 67 శాతం మంది ఉన్నారు. వీరిలో 34 శాతం మంది క్యాంప్‌సలో ఉన్నప్పటికీ, తమకు బయట ఉన్న భావనే కలుగుతోందని తెలిపారు. గత ఆరు నెలల కాలంలో అనేకసార్లు కుంగుబాటుకు గురయ్యామని, ఒంటరితనం భావన కొన్నివారాల తరబడి వేధించిందని 15 శాతం మంది చెప్పారు. గత ఏడాది కాలంలో ఆత్మహత్యా భావనకు తరచూ గురయ్యామని తొమ్మిది శాతం మంది తెలిపారు. దీనికి ముందు ఈ ఏడాది మొదట్లో స్థాయీ నివేదికను ఈ బృందం సమర్పించింది. ‘‘ఉన్నత విద్యాసంస్థల్లో సామాజిక వివక్ష తీవ్రంగా ఉంది. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థినులపై లైంగిక వేధింపులు నిత్యకృతంగా మారాయి. వైద్య, న్యాయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు చేయూత విషయంలో ఫ్యాకల్టీ లైంగిక వివక్షను ప్రదర్శిస్తోంది. హాస్టళ్లలో నైతిక పోలీసింగ్ కొనసాగుతోంది. నీట్-యూజీ, జేఈఈ ర్యాంకుల ద్వారా కుల గుర్తింపు పెద్ద సమస్యగా ఉంది. ప్రవేశాలు, శ్రేణీకరణ, భాషలో సమస్యలు, ఫ్యాకల్టీ శ్రద్ధ విషయంలో విద్యార్థులు కుల ఆధారిత అవమానాలకు గురి అవుతున్నారు’’ అని తన స్థాయీ నివేదికలో టాస్క్‌ఫోర్స్ తేల్చి చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి
సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై హెడ్ కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యంపై ఉగ్రదాడి.. జవాన్ మృతి