పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:41 AM
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల వల్ల ముంబైలోని న్యూ మండల ప్రాంతంలో 4అంతస్థుల భవనం కూలిపోవడంతో...
మహారాష్ట్రలో ఒక్కరోజే 13మంది మృతి
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి విధ్వంసం
న్యూఢిల్లీ, జూలై 7: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల వల్ల ముంబైలోని న్యూ మండల ప్రాంతంలో 4అంతస్థుల భవనం కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. పక్కనున్న రేకుల ఇంటిపై భవనం కూలడంతో ఒక కుటుంబం సజీవ సమాధి అయ్యింది. మొత్తంగా వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఒక్కరోజే 13 మంది చనిపోయారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలో 90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 16 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదని అధికారులు తెలిపారు. గుజరాత్ దక్షిణ ప్రాంతంలోనూ అతిభారీ వర్షాలు కురిశాయి. సూరత్ జిల్లాలోని కమ్రెజ్ తాలూకాలో 10 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూరత్ జిల్లాలో గత రెండు రోజుల్లో ఐదుగురు మరణించారు. అనేక రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. 2100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోనూ భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి దోడ జిల్లాలోని తాత్రి పట్టణంలో అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. దోడ, కిష్ట్వార్ జిల్లాల్లో గతరెండు రోజుల్లో మూడుసార్లు ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు, బండరాళ్లు దొర్లిపడటంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. దోడ-కిష్ట్వార్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆకస్మిక వరదలకు అనేక వాహనాలు చినాబ్ నదిలోకి కొట్టుకుపోయాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కోఝికోడ్ జిల్లాలను కలిపే రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న సొరంగ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. సొరంగ ప్రాంతంలో కార్మికులెవరూ లేరని, ఇంజనీర్లు, భద్రతా సిబ్బంది మాత్రమే మట్టికింద కూరుకుపోయినట్టు భావిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కార్మికులను తరలించేందుకు ఉపయోగించిన బస్సును ఆ ప్రాంతంలో నిలిపి ఉంచగా.. అది సమీప నదిలోకి కొట్టుకుపోయింది. ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రయాంక గాంధీ వాద్రా ‘ఎక్స్’లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్