Share News

కోడలు పొట్టి డ్రెస్సులు.. అత్తమామల ఆత్మహత్య!

ABN , Publish Date - May 15 , 2026 | 04:15 AM

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కోసం కోడలు పొట్టి దుస్తులు ధరిస్తుండడంపై చెలరేగిన వివాదం అత్తమామల బలవన్మరణానికి కారణమైంది. రీల్స్‌, వస్త్రధారణపై గ్రామీణ ప్రాంతానికి చెందిన...

కోడలు పొట్టి డ్రెస్సులు.. అత్తమామల ఆత్మహత్య!

న్యూఢిల్లీ, మే 14: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కోసం కోడలు పొట్టి దుస్తులు ధరిస్తుండడంపై చెలరేగిన వివాదం అత్తమామల బలవన్మరణానికి కారణమైంది. రీల్స్‌, వస్త్రధారణపై గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ అత్తమామలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం చివరికి ఆ దంపతుల ప్రాణాలనే తీసింది. కోడలు, ఆమె కుటుంబసభ్యులు వేధింపులు తాళలేక అత్తమామలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలోని పానిపట్‌ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పానిపట్‌ జిల్లాలోని నారా గ్రామానికి చెందిన రాజేష్‌(46) సుమన్‌(44) దంపతులకు ఆశీష్‌ అనే కుమారుడు ఉన్నారు. సోషల్‌ మీడియా ద్వారా తనకు పరిచయమైన ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించిన ఆశీష్‌ 2025 జనవరిలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. అయితే, రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహ.. జీవన విధానం, వస్త్రధారణపై గ్రామీణ నేపథ్యం కలిగిన ఆశీష్‌ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఈ విషయంలో స్నేహ, అత్తమామల మధ్య వాగ్వాదాలు జరిగి అవి క్రమంగా కుటుంబ కలహాలుగా మారాయి. స్నేహతోపాటు ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరి కూడా రాజేష్‌ దంపతులను వేధించడం మొదలుపెట్టారు. స్నేహ పలుమార్లు అత్తమామలపై భౌతిక దాడికి కూడా పాల్పడింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రాజేష్‌ దంపతులు విషం తీసుకొని ఆత్మహత్యకు యత్నించారు. మే9వ తేదీన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న దంపతులను గుర్తించిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే సరికే సుమన్‌ చనిపోగా.. రోహ్‌టక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేష్‌ ఆదివారం ఉదయం మరణించారు. ఈ మేరకు రాజేష్‌ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్నేహ, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Updated Date - May 15 , 2026 | 04:15 AM