Share News

Omelette Clue: మహిళ హత్య.. హంతకుడిని పట్టించిన ఆమ్లెట్ ముక్క

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:14 PM

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వెలుగుచూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఓ చిన్న ఆమ్లెట్ ముక్క ఆధారంగా ఛేదించారు. ఏఐ సాంకేతికత, సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆమ్లెట్ ముక్క కీలక ఆధారంగా మారింది.

Omelette Clue: మహిళ హత్య.. హంతకుడిని పట్టించిన ఆమ్లెట్ ముక్క
Omelette Clue

చిన్న ఆమ్లెట్ ముక్క ఓ మహిళ మర్డర్ కేసును ఛేదించింది. హంతకుడిని అడ్డంగా పట్టించింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 29వ తేదీన గ్వాలియర్‌లోని కటారే ఫామ్ హౌస్ దగ్గర పొదల్లో ఓ మహిళ శవం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ శవం అర్థనగ్నంగా ఉంది. ముఖం మొత్తం రాయితో గుర్తుపట్టలేనంతగా పాడై ఉంది. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


చనిపోయే ముందు మహిళపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. పోలీసులు ఏఐ సాయంతో మహిళ ముఖాన్ని క్రియేట్ చేశారు. ఏఐతో తయారు చేసిన ఫొటో సాయంతో ఆ మహిళ ఎవరో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి సమయంలో ఆమ్లెట్ ముక్క ఈ కేసును మలుపు తిప్పింది. మృతురాలు చనిపోయినప్పుడు స్వెటర్ ధరించి ఉంది. ఆ స్వెటర్ జేబులో చిన్న ఆమ్లెట్ ముక్క దొరికింది. పోలీసులు దాని సాయంతో కేసును ముందుకు నడిపించారు. ఆమ్లెట్‌లు తయారు చేసి అమ్మే వారి దగ్గరకు వెళ్లారు. మహిళ ఫొటో చూపించి ఎంక్వైరీ చేశారు. ఓ వ్యాపారి.. ఆ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులతో తన షాపులోనే ఆమ్లెట్ తినిందని చెప్పాడు.


పోలీసులు షాపు దగ్గరలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. హజీరా ఏరియాకు చెందిన సచిన్ సేన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. అతడు ఏం చెప్పాడంటే.. తికమ్‌ఘర్‌కు చెందిన ఆ మహిళతో కొన్ని నెలల క్రితం సచిన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, ఆమె తనతోనే కాకుండా వేరే వాళ్లతో కూడా సన్నిహితంగా ఉందని సచిన్ అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతోనే ఆమెను చంపేశాడు. ఆమ్లెట్ తిన్న తర్వాత మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె ముఖాన్ని బండరాయితో గుర్తుపట్టలేనంతగా పాడు చేశాడు. పోలీసులు సచిన్‌ను అరెస్ట్ చేశారు. మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..

ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ

Updated Date - Jan 06 , 2026 | 03:49 PM