ప్రేమ పెళ్లి చేసుకుని 4 నెలలు.. భార్యపై భర్త దారుణం..
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:19 PM
అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. భార్యకు విషం ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. గురుగావ్‌కు చెందిన అరుణ్ శర్మ స్థానికంగా ఉండే ఓ నర్సింగ్ హోమ్‌లో రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్నాడు. అతడికి అక్కడ నర్సుగా పని చేస్తున్న కాజల్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం కొంత కాలానికి ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవటంతో గత సంవత్సరం నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. నెల రోజుల తర్వాత అరుణ్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. అదనపు కట్నం కోసం ఆమెను హింసించటం మొదలెట్టాడు. మార్చి 4వ తేదీ నుంచి ఇద్దరూ గర్హి హర్సారులోని కాజల్ ఇంటికి వచ్చి ఉంటున్నారు. మార్చి 17వ తేదీన మద్యం మత్తులో అరుణ్ భార్యపై దాడి చేశాడు. మరుసటి రోజు ఇద్దరూ మెట్ల దగ్గర గొడవపడసాగారు.
కొద్దిసేపటి తర్వాత కాజల్ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉండటాన్ని కుటుంబసభ్యులు చూశారు. ముక్కులోంచి రక్తం కారుతున్న కాజల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాజల్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. కాజల్ తల్లిదండ్రులు అరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని టాయిలెట్‌లో సిరంజి చూశామని, అతడు తమ కూతురికి విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. విషం ఇంజెక్షన్ ఇచ్చి భార్యను చంపానని చెప్పాడు.
ఇవి కూడా చదవండి
మీ కళ్లు చురుకైనవి అయితే.. తప్పు స్పెల్లింగ్‌తో ఉన్న పదాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..
ఐపీఎల్ 2026: ఢిల్లీ జట్టులోకి పునరాగమనం.. భావోద్వేగానికి గురైన పృథ్వీ షా