Share News

హిందూ వివాహంలో రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు, ఆచారాలు అవసరం: గుజరాత్ హైకోర్టు

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:15 PM

హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం 'సప్తపది' వంటి శాస్త్రోక్తమైన క్రతువులు, ఆచారాలు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

హిందూ వివాహంలో రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు, ఆచారాలు అవసరం: గుజరాత్ హైకోర్టు
Gujarat HC: Hindu Marriage Needs Rituals, Not Just Registration

అహ్మదాబాద్(గుజరాత్)జూలై, 1: హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం 'సప్తపది' (ఏడడుగులు) వంటి శాస్త్రోక్తమైన క్రతువులు, ఆచారాలు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం అనేది కేవలం 'పాటలు, డ్యాన్స్‌లు, విందు వినోదాల' కోసం జరుపుకునే వేడుక కాదని కోర్టు వ్యాఖ్యానించింది.


భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నప్పటికీ, ఈ సంప్రదాయ వేడుకలు ఒక వ్యక్తి ఆధ్యాత్మికతను శుద్ధి చేసి, పరివర్తన చెందిస్తాయని నమ్ముతారని హైకోర్టు జూన్ 23 నాటి ఉత్తర్వులో పేర్కొంది.

ఒక జంట మధ్య జరిగిన వివాహాన్ని చెల్లనిదిగా ప్రకటించడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ, యూకేలో నివసిస్తున్న ఒక వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ తీర్పు వెలువడింది.

గతేడాది నవంబర్‌లో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తూ, జస్టిస్‌ ఇలేష్ వోరా, జస్టిస్‌ ఆర్.టి. వాచ్ఛానిలతో కూడిన డివిజన్ బెంచ్, సప్తపది వంటి ఆవశ్యకమైన వేడుకలను నిర్వహించడమే హిందూ వివాహానికి పునాది అని తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఉత్తర్వు ప్రతిని సోమవారం అందుబాటులోకి తెచ్చారు.

సప్తపది వంటి వేడుకలు.. అంటే వధూవరులు పవిత్రమైన అగ్ని ముందు కలిసి ఏడు అడుగులు వేయడం వివాహానికి పవిత్రమైన సంస్కారంగా ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయని కోర్టు పేర్కొంది.


అసలు కేసేంటి?

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లో నివసిస్తున్న కౌశల్ సోనార్ అనే వ్యక్తికి, అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళకు పెళ్లయినట్లు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెలుగులోకి వచ్చింది. అయితే, సదరు మహిళ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించే వరకు తనకు ఆ పెళ్లి గురించి తెలియదని, తన సంతకాన్ని ఫోర్జరీ లేదా మోసపూరితంగా సేకరించారని కౌశల్ కోర్టును ఆశ్రయించాడు. తమ మధ్య ఎలాంటి హిందూ సంప్రదాయ వివాహ క్రతువులు జరగలేదని, భార్యాభర్తలుగా కలిసి ఉండలేదని స్పష్టం చేశాడు.

ఈ వివాహం చెల్లదంటూ కౌశల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో ఫ్యామిలీ కోర్టు కొట్టివేయగా, ఆయన హైకోర్టులో అప్పీల్ చేశారు. విచారణలో.. తమ మధ్య ఎలాంటి సంప్రదాయ వివాహ క్రతువులు జరగలేదని సదరు మహిళ కూడా అంగీకరించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును తప్పుబడుతూ హైకోర్టు ఆ వివాహాన్ని రద్దు చేసింది.

Updated Date - Jul 01 , 2026 | 01:52 PM