Share News

గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కలకలం

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:06 AM

చండీపుర వైరస్‌ గుజరాత్‌లో తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ వైరస్‌ కారణంగా ఐదు వారాల వ్యవధిలో 25 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో...

గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కలకలం

  • 25 మంది చిన్నారులు మృతి

  • వైరస్‌ వ్యాప్తి.. అంతుచిక్కని వైనం

అహ్మదాబాద్‌, ఆగస్టు 13: చండీపుర వైరస్‌ గుజరాత్‌లో తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ వైరస్‌ కారణంగా ఐదు వారాల వ్యవధిలో 25 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో పరిశోధకులు, ఆరోగ్యరంగ నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఇసుక ఈగలు ఈ వైర్‌సకు ప్రధాన వాహకాలుగా భావిస్తున్నప్పటికీ... వేల సంఖ్యలో సేకరించిన ఈ కీటకాలలో వైరస్‌ ఆనవాళ్లేమీ లభించకపోవడం ఆరోగ్యరంగ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30న వైరస్‌ వ్యాప్తి మొదలైన తర్వాత వేలాది ఇసుక ఈగల నమూనాలను పరీక్షించారు. అలాగే ఈ వైర్‌సను మోసుకెళ్లే అవకాశం ఉన్న దోమలు, ఇతర కీటకాలనూ పరీక్షించారు. కానీ.. దేనిలోనూ వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అసలు ఈ వైరస్‌ ఎలా విస్తరిస్తోంది..? అన్న ప్రశ్న పరిశోధకులను వేధిస్తోంది. ఈ క్రమంలో పశువులు, మేకలు వాటి పాలు, రక్త నమూనాలను కూడా పరీక్షించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024లోనూ ఈ వైరస్‌ లక్షణాలు కనిపించిన 78 మంది పిల్లల్లో 28 మంది చనిపోయారు. ప్రస్తుతం మరణించిన 25 మందితోపాటు మరో 39 మంది చిన్నారులకు చండీపుర వైరస్‌ సోకినట్టు గుజరాత్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. ప్రస్తుతం గుజరాత్‌లోని 12, రాజస్థాన్‌లోని 3 జిల్లాలో ఈ వైరస్‌ బాధితులు ఉన్నారు. ఈ వైర్‌సను 1965లో తొలిసారిగా మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన చండీపుర అనే గ్రామంలో గుర్తించారు. అందుకే ఈ వైరస్‌ కు చండీపుర పేరు పెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 06:06 AM