జీటీఏ-6.. 24 గంటలు.. రూ.22 వేల కోట్లు!
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:52 AM
ఒక వీడియో గేమ్.. కేవలం 24 గంటల సమయంలో ఏకంగా 22 వేల కోట్ల అమ్మకాలు సాధించింది.
జీటీఏ-6.. 24 గంటలు.. రూ.22 వేల కోట్లు!
- వినోద రంగంలో ఈ గేమ్ కొత్త రికార్డు
న్యూఢిల్లీ, నవంబరు 20: ఒక వీడియో గేమ్.. కేవలం 24 గంటల సమయంలో ఏకంగా 22 వేల కోట్ల అమ్మకాలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలు, వినోద రంగంలోని అన్ని రికార్డులను తుక్కు కింద బద్దలుకొట్టేసింది. అదే ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో(జీటీఏ)-6’. గురువారం (నవంబరు 19న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమ్.. తొలి 24 గంటల్లోనే 2.46 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. వాటి విలువ 2.36 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22 వేల కోట్లు) కావడం గమనార్హం. మార్కెట్ పరిశోధనా సంస్థ సెన్సార్ టవర్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ అమ్మకాల్లో 75శాతం ప్లేస్టేషన్ ద్వారా జరిగాయని తెలిపింది. ప్రస్తుతం విడుదలైనది కేవలం గేమింగ్ పరికరాలైన ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్ వెర్షన్లు మాత్రమేనని, ఇంకా పర్సనల్ కంప్యూటర్ వెర్షన్ విడుదలైతే మరెన్ని రికార్డులు సృష్టిస్తుందోనని తెలిపింది. రెండు నగరాలు, నేరాలు, ముఠాలపై దాడుల నేపథ్యంతో రాక్‌స్టార్ గేమ్స్ ఈ గేమ్‌ను రూపొందించింది. ఇంతకుముందు 2013లో విడుదలైన జీటీఏ-5 తొలిరోజునే సుమారు రూ.7,550 కోట్లు (81.5 కోట్ల డాలర్లు) విక్రయాలు సాధించగా, జీటీఏ-6 మూడింతలు సాధించింది. జీటీఏ-6ను రూపొందించడానికి దాదాపు పదేళ్లు పట్టింది. సుమారు ఒక బిలియన్ డాలర్లు (రూ.9,270 కోట్లు) ఖర్చయినట్టు అంచనా. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జీటీఏ-6 మేనియా పట్టుకుంది. చాలా దేశాల్లో ఉద్యోగులు ఈ గేమ్ ఆడటం కోసమే సెలవులు పెడుతున్నారని కంపెనీలు చెబుతున్నాయి. అమెరికాలో జార్జియాలో ఉన్న ఆర్మీ 9వ బ్రిగేడ్ ఇంజనీర్ బెటాలియన్‌లో 43 మంది సైనికులు జీటీఏ-6 గేమ్ ఆడటం కోసం రెండేళ్ల నుంచి ఆరేళ్ల వరకు అదనంగా సర్వీసులో కొనసాగడానికి ముందుకురావడం గమనార్హం.