Share News

మహిళా కోటా పునర్విభజనపైముందుకే!

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:53 AM

దశాబ్దాలుగా కొనసా..గుతున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై వీలైనంత త్వరగా అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. అంత తొందర ఏముంది.....

మహిళా కోటా  పునర్విభజనపైముందుకే!

  • 5 రాష్ట్రాల ఎన్నికల్లోపే బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమైన కేంద్రం

  • వారాంతానికి ఉభయసభలను వాయిదా వేసి 2వారాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టే యోచన

  • అవసరమైతే ఉభయ సభలనూ సంయుక్తంగా సమావేశపరచి ఆమోదింపజేసుకునే ప్రణాళిక

  • అంత తొందరెందుకు? విధివిధానాలు ఏమిటి?

  • రిజిజుకు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే లేఖ

  • ఏప్రిల్‌ 29న 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌

  • నేటి క్యాబినెట్‌ భేటీలో 2 బిల్లులకు ఆమోదం!

  • పునర్విభజనతో పెరగనున్న ఎస్సీ, ఎస్టీ స్థానాలు

  • ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు 84 నుంచి 126కు

  • 47 నుంచి 70కి పెరగనున్న ఎస్టీ నియోజకవర్గాలు

  • 1-2 స్థానాలే ఉన్న చోట్ల రొటేషన్‌లో మహిళలకు!

న్యూఢిల్లీ,మార్చి 24 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా కొనసా..గుతున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై వీలైనంత త్వరగా అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. అంత తొందర ఏముంది? ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆగాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి! ఈ బిల్లులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు అంశాలపై సస్పెన్స్‌ నెలకొన్నది. మహిళా కోటాను ఏ ప్రాతిపదికన చేపడతారు? విధివిధానాలు ఏమిటి? అసలు సవరణ బిల్లులో ఏం ప్రతిపాదించారనే అంశాలతో నోట్‌ సర్క్యులేట్‌ చేయాలని.. ఏప్రిల్‌ 29న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజుకు మంగళవారం లేఖ రాశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఈ లేఖను రిజిజుకు అందజేశారు. ఆ లేఖపై ఇండియా కూటమికి చెందిన డీఎంకే, ఎన్సీపీ, శివసేన, జేఎంఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ తదితర పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా కోటాకు సంబంధించిన బిల్లులపై మోదీ సర్కారు శరవేగంగా పావులు కదుపుతుండడంతో.. ఇండియా కూటమి నేతలు ప్రత్యేకంగా సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు.. కిరెన్‌ రిజిజూ మూడుసార్లు ఖర్గేతో మాట్లాడారు. ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదని తెలిసింది. కానీ ఈ బిల్లులపై ఇప్పటికే ఎన్డీయే మిత్రపక్షాలనన్నిటినీ ఒప్పించిన మోదీ ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపే వాటిని ఆమోదింపజేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నది. ఈ వారాంతంలో ఉభయ సభలను వాయిదా వేసి.. మరో రెండు వారాల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వాటికి ఆమోద ముద్ర వేయించాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది.


మంగళవారం హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను, ఇతర ప్రతిపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించాలని, అవసరమైతే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి బిల్లులను ఆమోదింపజేయాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. ఉభయ సభలు కలిసికట్టుగా సమావేశమైతే బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తుందని చెబుతున్నారు.

మహిళల ఓట్లు పడతాయనే..

లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం మేరకు పెంచి.. వాటిలో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించడం వల్ల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం లభిస్తుందని... మహిళల ఓట్లు పడతాయని మోదీ భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. లోక్‌సభ సీట్లు 816కు పెరిగి.. అందులో 273 సీట్లు మహిళలకు రిజర్వు అవుతాయని, ఇతరత్రా నియోజకవర్గాల్లో పోటీ చేసే మహిళలను కూడా కలుపుకొంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిపోతుందని తెలిస్తే మహిళలు పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓటు వేస్తారని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా.. మహిళా ముఖ్యమంత్రి ఉన్న బెంగాల్‌లో పార్టీకి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనే ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు.. బుధవారం జరిగే కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లుతో పాటు, డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రూపొందించిన మరో బిల్లునూ ఆమోదించే అవకాశాలున్నాయి.


ఇదీ నేపథ్యం..

లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పిస్తూ కల్పిస్తూ మోదీ సర్కారు రూపొందించిన ‘నారీ వందన్‌ అధినియమ్‌-2023’ బిల్లు 2023 సెప్టెంబరులో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత జరిగే తొలి జన గణనలో వచ్చిన గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను నిర్ణయించాలని ఆ బిల్లులోనే నిర్దేశించారు. అలా చేయాలంటే 2026 జనగణన పూర్తి చేసి.. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది. కానీ, అందుకు చాలా సమయం పడుతుంది. 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆ కసరత్తు పూర్తికాదు. మోదీ సర్కారు మాత్రం.. ఆలోగానే ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేసి మహిళా కోటాతో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. అందుకే.. 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు మార్గం సుగమం చేసే రాజ్యాంగ సవరణ బిల్లును వీలైనంత త్వరగా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ అంతా ఒక కొలిక్కి వస్తే ఆ ఎన్నికల్లో కూడా ఉపయోగం ఉంటుందని భావిస్తోంది. ఒకవేళ బిల్లులను ప్రవేశపెట్టలేకపోయినా.. ప్రభుత్వం మహిళా కోటా కల్పించేందుకు సిద్ధంగా ఉందనే సందేశం ప్రజలకు చేరుతుందని, అది రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం.


అందరికీ మెప్పించే ప్రయత్నమేనా?

రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభా నియంత్రణ విధానాలను సమర్థంగా అమలు చేసిన దక్షిణాదిరాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అదేసమయంలో.. జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగిపోయి, ప్రభుత్వ ఏర్పాటులో అవే కీలకంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తిమీద సాములా మారిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై మోదీ సర్కారు చాకచక్యంగా వ్యవహరించి.. ప్రతిపక్షాలు సైతం కాదనలేని విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంచుతూ మధ్యే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఎందుకంటే.. దీనివల్ల ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల బలాబలాలు ఇప్పుడున్నట్టుగానే కొనసాగుతాయి. తక్కువ విమర్శలు, అభ్యంతరాలతో ఈ జటిల సమస్య నుంచి గట్టెక్కగలుగుతామని ప్రభుత్వం భావిస్తోంది. మోదీ సర్కారు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభ సీట్లు పెరుగుతాయి. 543 నుంచి 816కు పెరిగి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీ మార్కు 409కి చేరుతుంది. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 543 నియోజకవర్గాల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉన్న 84 స్థానాల సంఖ్య 126కు పెరుగుతుంది. అలాగే, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 47 నుంచి 70కి పెరుగుతుంది. 1-2 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో.. ఆయా నియోజకవర్గాలను ప్రతి మూడు ఎన్నికలకు ఒకసారి మహిళలకు కేటాయిస్తారు. మూడుపర్యాయాలపాటు ఆ సీటు మహిళలకే రిజర్వు అయి ఉంటుంది. కాగా.. ప్రత్యక్ష ఎన్నికలు జరిగే దిగువ సభలకు (లోక్‌సభ, శాసనసభలు) మాత్రమే మొదట్నుంచీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. కాబట్టి.. ఎగువసభలైన రాజ్యసభ, శాసనమండళ్లకు మహిళా కోటా వర్తించదు.

Updated Date - Mar 25 , 2026 | 03:53 AM