Share News

ప్రశ్నపత్రాల లీక్‌ కేసుల్లో దర్యాప్తు రెండునెలల్లో పూర్తి!

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:33 AM

ప్రశ్నపత్రాల లీక్‌ కేసుల్లో దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రతి రాష్ట్రంలోనూ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను...

ప్రశ్నపత్రాల లీక్‌ కేసుల్లో దర్యాప్తు రెండునెలల్లో పూర్తి!

రేపు లోక్‌సభ ముందుకు బిల్లు

న్యూఢిల్లీ, జూలై 25: ప్రశ్నపత్రాల లీక్‌ కేసుల్లో దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రతి రాష్ట్రంలోనూ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘పేపర్‌ లీక్‌ వ్యతిరేక చట్టం-2024’కు కేంద్రం ఈ మేరకు సవరణలు చేయనుంది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడినవారికి, లేదా పరీక్షల్లో అనైతికంగా ప్రవర్తించేవారికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా పదేళ్లు జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్టు లోక్‌సభ సభ్యులందరికీ సర్క్యులేట్‌ చేసిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు-2026’లో పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు శుక్రవారమే కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సంస్థాగతంగా చేసే నేరాలకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానాను బిల్లులో ప్రతిపాదించారు. ప్రశ్నపత్రాల లీక్‌ కేసులను త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, నిష్పాక్షికత తీసుకురానున్నట్టు వివరించారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరితగతిన విచారణ జరిపేందుకు ఏదేని సెషన్‌ కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదిత చట్టం అధికారం కల్పించనుంది. చార్జిషీటు దాఖలు చేసినప్పటి నుంచి మూడు నెలల్లోగా కోర్టు విచారణ పూర్తి చేసేలా ప్రతిరోజూ విచారణ కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. అవసరమైతే దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికీ ప్రతిపాదిత చట్టం అధికారాన్ని కల్పించనుంది.

‘కాక్రోచ్‌’ ఆందోళనలపై ఐరాస స్పందన

ఐరాస, జూలై 25: ప్రజల శాంతియుత నిరసనలను అనుమతించాల్సిందేనని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. అరెస్టు చేస్తామనో, లేక దాడి చేసి గాయపరుస్తామనో, వేధింపులకు గురిచేస్తామనో వారిని భయపెట్టకూడదని తేల్చిచెప్పింది. కాక్రోచ్‌ జనతాపార్టీ నేతృత్వంలో ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై తమకు పూర్తి అవగాహన ఉందని తెలిపింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ భారత్‌లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజర్రిక్‌ శుక్రవారం ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘శాంతియుతంగా ఆందోళన చేయాలనుకుంటున్న ప్రజల ఆకాంక్షలను గౌరవించడం ముఖ్యం. మిగిలిన అన్నిచోట్ల వలే అక్కడ కూడా వారి హక్కులను పరిరక్షించడం భద్రతా దళాల బాధ్యత’ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 04:33 AM