Share News

జెన్‌తర్‌.. మంతర్‌!

ABN , Publish Date - Jul 26 , 2026 | 06:00 AM

అణచివేత విధానాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఎగిసిపడటం కొత్తేమీ కాదు! గత రెండు, మూడేళ్లలో పొరుగుదేశాల్లోనే ఇన్‌స్టెంట్‌ ఉద్యమాలనూ చూశాం! అప్పటికప్పుడు రాజుకొని...

జెన్‌తర్‌.. మంతర్‌!

శాంతియుత ఉద్యమానికి కొత్త హంగులద్దిన జెన్‌జీ

  • శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌లో జెన్‌జీ నిరసనలు హింసాత్మకం

  • మన యువత తీరు ప్రత్యేకం

  • లాఠీలు పట్టిన పోలీసులతో అంకుల్‌ అంటూ ఆత్మీయ సంబోధన

న్యూఢిల్లీ, జూలై 25: అణచివేత విధానాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఎగిసిపడటం కొత్తేమీ కాదు! గత రెండు, మూడేళ్లలో పొరుగుదేశాల్లోనే ఇన్‌స్టెంట్‌ ఉద్యమాలనూ చూశాం! అప్పటికప్పుడు రాజుకొని.. ప్రభుత్వాలనే గడగడలాడించిన ఉద్యమాలకు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలు సాక్షీభూతంగా నిలిచాయి! ఈ మూడు చోట్లా జెన్‌-జీ దెబ్బకు ప్రభుత్వాలే కూలిపోయాయి! మనదేశంలో కాక్రోచ్‌ల పేరుతో కదిలిన జెన్‌జీ తమ లక్ష్య సాఽధన కోసం ఒక్కొక్కరుగా కదలి.. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దండులా కలిసి.. పిడికిలి బిగించి.. నినదించి అనుకున్నది సాధించారు! అయితే మనదేశ యువత ఉద్యమం నిర్వహించే క్రమంలో ప్రదర్శించిన దీక్ష, పోరాటపటిమ, పరిణతి ఈ మూడు దేశాల్లోని ప్రజా ఉద్యమం కన్నా పూర్తిగా ప్రత్యేకమైనది!! గాంధీ పుట్టిన గడ్డ మీద ఆయన చూపిన మార్గంలోనే ఎక్కడా సంయమనం కోల్పోకుండా శాంతియుతంగా తమ గళాన్ని వినిపించారు! ఉద్యమానికి సృజనాత్మకను జోడించి కొత్త ఉద్యమ పోకడలతో ప్రజలను అబ్బురపరిచి వారిని టీవీలు, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయేలా చేశారు. కర్రలు, తుపాకులు పట్టుకొని నిల్చున్న పోలీసులు, భద్రతాదళాలతో ‘అంకుల్‌.. అంకుల్‌’ అంటూ ఎంతో ప్రేమగా మాటలు కలిపారు. ‘మీకూ పిల్లలుంటారు. వారూ రేప్పొద్దున పరీక్షలు రాస్తారు కదా?. మరి.. ఇలానే పేపర్లు లీకతై వారి భవిష్యత్తు ఎలా?’ అంటూ ఆ తమ బాధను కళ్లకు కట్టే ప్రయత్నం చేసి వారి మనసులనూ కరిగించారు. ఎక్కణ్నుంచో తమ కోసం వస్తున్న ఆహార పొట్లాలు, మంచినీళ్ల బాటిళ్లను ‘మీరు డ్యూటీ చేస్తున్నారు.. ఆకలి దప్పులతో ఉంటారు. ఇంద, తీసుకోండి’ అంటూ వారికి ఇచ్చి ఔదార్యాన్ని ప్రదర్శించారు. పోలీసులకు గులాబీలను ఇస్తూ ‘మేం కల్మషం లేని పువ్వులాంటి వాళ్లం అర్థం చేసుకోండి’ అన్న మెసేజ్‌ ఇచ్చారు. కుర్రకారు కదా.. కొందరైతే తమలో సహజంగా ఉండే కొంటెతనాన్నీ ప్రదర్శించారు. వెళుతున్న పోలీసులను ఉద్దేశించి ఓ అమ్మాయి ‘అంకుల్‌.. నన్ను కొడతారా! నేను ప్రొటీన్‌ షేక్‌ తీసుకోలేదు. వేగంగా పరుగెత్తలేను’ అని అంటుంటే వారు నవ్వుకుంటూ వెళ్లిపోతున్న తాలూకు వీడియో క్లిప్‌ ఎంతోమందిని ఆకట్టుకుంది. లాఠీలతో పోలీసులు తమవైపు దూసుకొస్తుంటే కొందరు.. ఒక్కసారిగా ‘జనగణమన అధినాయక..’ అంటూ జాతీయ గీతాలాపన చేశారు. అంతే.. ఆ పోలీసులు కాస్తా స్థాణువులా నిల్చుండిపోయారు. ఇది నెటిజెన్లను కట్టిపడేసింది. లాఠీలతో పోలీసులు ఒళ్లు హూనమయ్యేలా కొట్టినా.. రక్తాలు కారుతున్న ఆ బాధలోనూ విచక్షణ కోల్పోకుండా.. ‘సరే, మీరు ఇళ్లకు వెళ్లి ఆందోళన చేస్తున్న పిల్లలను చావబాదామని మీ వాళ్లకు చెప్పండి అంకుల్‌’ అని అన్నారే తప్ప వారి మీద తిరగబడేందుకు ప్రయత్నించలేదు! జూన్‌ 20న మొదలు శుక్రవారం దాకా అంటే 35 రోజుల్లో జంతర్‌మంతర్‌ వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు పాల్పడలేదు. సీజేపీ పిలుపు మేరకు ‘ఛలో పార్లమెంట్‌’ ర్యాలీలో ఆ వైపు కదిలారు తప్ప.. ఉడుకురక్తం తాలూకు అత్యుత్సాహాన్ని ఏ దశలోనూ ప్రదర్శించలేదు. పొరుగుదేశాల్లో మాదిరిగా ఆస్తుల విధ్వంసానికి పాల్పడలేదు.


ఆ మూడు దేశాల్లో ‘చేయి దాటిపోయాయ్‌’

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ప్రభుత్వ పెద్దల అవినీతి, పాలనా వైఫల్యాలకు వ్యతిరేకంగా 2022లో అక్కడి యువత వ్యక్తం చేసిన నిరసనలు ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసేదాకా వెళ్లాయి. ఏకంగా అధ్యక్ష భవనాన్ని అక్రమించుకొని భయాత్పోతాన్ని సృష్టించారు! 2025లో నేపాల్‌లో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యపై తీవ్ర అసంతృప్తితో యువత.. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీసి 72 నుంచి 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ఆచూకీ తెలియలేదు. బంగ్లాదేశ్‌లో 2024లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఉద్యోగాల్లో 30శాతం దాకా రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా యువత నిరసనలతో మొదలైన ఉద్యమం ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. చివరికి హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ దాకా వెళ్లింది. చివరకు ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. శ్రీలంకలోనూ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే.. భార్య, ఇద్దరు భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకొని దేశ వైమానికదళ విమానంలో మాల్దీవులకు, అక్కడి నుంచి సింగపూర్‌కు పారిపోయారు. అప్పట్లో నేపాల్‌లోనూ ఓలీ ప్రభుత్వం యువత ఉద్యమాన్ని అణచివేసేందుకు ఇంటర్నెట్‌ బంద్‌ చేసింది. సోషల్‌ మీడియాపై నిషేధం విధించింది. దీన్ని తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిగా పరిగణించిన యువత నిరసనలకు దిగింది. చివరికి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించడంలో ప్రదాని పదవి నుంచి ఓలీ దిగిపోక తప్పలేదు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 06:00 AM