Share News

అద్భుతం చేసిన బెంగళూరు స్టార్టప్.. కక్ష్యలోకి తొలి ఆప్టోసార్ శాటిలైట్

ABN , Publish Date - May 03 , 2026 | 05:31 PM

బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ గెలాక్స్‌ఐ తొలి విజయాన్ని అందుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ శాటిలైట్‌ దృష్టిని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

అద్భుతం చేసిన బెంగళూరు స్టార్టప్.. కక్ష్యలోకి తొలి ఆప్టోసార్ శాటిలైట్
GalaxEye Optosar Satellite

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ గెలాక్స్‌ఐ తన తొలి కమర్షియల్ ఉపగ్రహం దృష్టిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాలిఫోర్నియాలో (అమెరికా) ఈ ప్రయోగం జరిగింది. స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ సాయంతో ఈ శాటిలైట్ కక్ష్యలోకి చేరింది. ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ శాటిలైట్ దృష్టి అని సంస్థ పేర్కొంది. శాటిలైట్‌లలోని ఎర్త్‌అబ్జర్వేషన్ సాంకేతికతలకు సంబంధించి ఇది ఒక మైలురాయి అని పేర్కొంది. ఎలక్ట్రోఆప్టికల్, సింథటిక్ అపర్చర్ రాడార్‌లను ఒకే వేదికపైకి తెచ్చిన తొలి ఉపగ్రహం ఇదేనని సంస్థ వివరించింది.

190 కేజీల బరువుతో ఒక రిఫ్రిజ్‌రేటర్ పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహం 1.5 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రాలను అందిస్తుంది. ఇప్పటికే డిఫెన్స్ రంగంతో పాటు పౌర సంస్థలు ఈ శాటిలైట్ సేవలపై ఆసక్తి కనబరిచాయని కూడా సంస్థ వెల్లడించింది. ఇక గెలాక్స్‌ఐ‌ సంస్థ తొలి విజయాన్ని అందుకోవడంపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. అభినందనలు తెలియజేశారు.


మేఘాలు అడ్డుగా ఉన్నా, చీకటి ఉన్నా కూడా ‘దృష్టి’ భూమి చిత్రాలు తీయగలదు. ఆప్టికల్ శాటిలైట్‌లు సాధారణ సమయాల్లో హైరిజల్యూషన్ చిత్రాలను అందించగలవు. అయితే, రాడార్ శాటిలైట్‌లు పగటి వేళలతో పాటు రాత్రి వేళ, మబ్బులు అడ్డంగా ఉన్న సమయాల్లో కూడా భూ ఉపరితల చిత్రాలు తీయగలవు. కానీ, ఈ చిత్రాల నాణ్యత తక్కువగా ఉండటంతో శాస్త్రవేత్తలకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ రెండు సాంకేతికతలను ఒకే వేదికపై తేవడం ద్వారా దృష్టి శాటిలైట్ మరింత మెరుగైన చిత్రాలను తీయగలదని గెలాక్స్‌ఐ పేర్కొంది. వ్యవసాయం, మౌలికవసతుల ప్లానింగ్, ఇన్సూరెన్స్ అంచనా వంటి అనేక విభాగాలతో పాటు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడతాయని కూడా గెలాక్స్‌ఐ వెల్లడించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన ప్యాసింజర్.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఘటన

Updated Date - May 03 , 2026 | 06:59 PM