Share News

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన ప్యాసింజర్.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఘటన

ABN , Publish Date - May 03 , 2026 | 03:46 PM

ఎయిర్‌పోర్టులో కదులుతున్న విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి ఒక ప్రయాణికుడు కిందకు దూకిన ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన ప్యాసింజర్.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఘటన
Passenger Jumps From Plane in Chennai Airport

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై ఎయిర్‌పోర్టులో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎయిర్ అరేబియా విమానం‌లోని ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ తలుపు తెరిచి కిందకు దూకేశారు. షార్జా నుంచి వచ్చిన విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండయ్యాక టాక్సీవే మీదుగా టెర్మినల్ వేపు వెళుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, విమానం మెల్లిగా కదులుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఎయిర్‌‌పోర్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. విమానం కూడా దెబ్బతినలేదని చెప్పారు. అప్పటికే ప్రయాణికుడు అనారోగ్యంతో ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ప్రయాణ సమయంలోనే ఆయన వాంతులు చేసుకున్నట్టు కూడా తెలిసింది.


ఇక విషయం తెలియగానే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కారణంగా ఎయిర్‌పోర్టు కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 3.23 గంటల నుంచి గంట పాటు రన్‌వేను మూసేసి ఇతర విమానాలను రెండో రన్‌వేపైపు మళ్లించారు. ఇక విమానం నుంచి దూకిన ప్యాసింజర్ ఎవరో ఇంకా తెలియరాలేదు. అయితే, ఆయన తమిళనాడుకు చెందిన వారని సమాచారం. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలనూ చదవండి:

రీల్స్ పిచ్చితో ఒకరి మృతి, నలుగురికి గాయాలు.. రంగంలోకి దిగిన ఆర్మీ..

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

Updated Date - May 03 , 2026 | 04:17 PM