Share News

బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:00 AM

మహిళల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ.....

బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

  • దేశవ్యాప్తంగా అందించనున్న కేంద్రం

  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు చర్యలు

  • 14 ఏళ్ల వయసున్న బాలికలకు సింగిల్‌ డోస్‌ గార్డాసిల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: మహిళల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ (హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 14 ఏళ్ల వయసున్న బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాను అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుందని ఆరోగ్యశాఖ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సింగిల్‌ షాట్‌ గార్డాసిల్‌ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను అందిస్తారు. ఇది గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ వైర్‌సలోని నాలుగు రకాల (6, 11, 16, 10) ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఒక వ్యాక్సిన్‌ డోసు తీసుకోవడం వల్ల బాలికలకు సంబంధిత వైర్‌సల నుంచి దీర్ఘకాలిక రక్షణ ఉంటుంది. జాతీయ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనుంది. 15 ఏళ్లలోపు వయసున్న బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న గార్డాసిల్‌-4 అనే వ్యాక్సిన్‌ను రెండు డోసులు అందించాల్సి ఉంటుంది. ఒక్కో డోసు ధర రూ.3,927. అయితే 15 ఏళ్లు పైబడిన బాలికలు మాత్రం మూడు డోసులు తీసుకోవాలి. గార్డాసిల్‌-4 వ్యాక్సిన్‌ను ఎంఎ్‌సడీ ఇండియా అనే సంస్థ తయారు చేస్తోంది. ఈ టీకా 2006లో అందుబాటులోకి రాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్టు అంచనా. హెచ్‌పీవీ రకాల వల్ల వ్యాపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడంలో ఈ టీకా 93 నుంచి 100 శాతం ప్రభావంతో పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయి.

Updated Date - Feb 25 , 2026 | 01:00 AM