ఫ్యాటీ లివర్‌తో పరేషాన్
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:36 AM
ఫ్యాటీ లివర్.. అంటే కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోయే సమస్య! ఒకప్పుడు అతిగా మద్యం తాగేవారికి మాత్రమే ఎక్కువగా వచ్చేది. కానీ..
హైదరాబాద్‌లో తీవ్రం.. 40.9శాతం మంది బాధితులు.. సీఎస్ఐఆర్ సర్వేలో వెల్లడి.. ఏఐజీ విస్తృత అధ్యయనం
గుండెపైనా ప్రభావం చూపుతున్న ఫ్యాటీ లివర్ సమస్య
దాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ముప్పు
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి: వైద్యులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఫ్యాటీ లివర్.. అంటే కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోయే సమస్య! ఒకప్పుడు అతిగా మద్యం తాగేవారికి మాత్రమే ఎక్కువగా వచ్చేది. కానీ.. ఇటీవలికాలంలో ఊబకాయం, మధుమేహం, మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ (మన శరీరం మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చుకునే ప్రక్రియను మెటబాలిజం అంటారు. ఆ ప్రక్రియలో లోపం తలెత్తితే దాన్ని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అంటారు) వంటి వాటివల్ల ఫ్యాటీలివర్ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా.. రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఈ సమస్యతో బాధపడుతున్నవారి సగటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా సీఎ్‌సఐఆర్ దేశవ్యాప్తంగా 27 పట్టణాల్లో 10 వేల మందిని ఎంపిక చేసి.. వారిలో 7764 మందికి పరీక్షలు చేయించారు. వారిలో 38.9 శాతం మంది ‘మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్‌డీ)’ బారిన పడ్డట్టు తేలింది. హైదరాబాద్‌లో ఈ సగటు 40.9 శాతంగా (పురుషుల్లో 46శాతం, మహిళల్లో 36.2శాతం) ఉండగా.. ఢిల్లీలో 41.3శాతం, చెన్నైలో 41.2శాతం, బెంగళూరులో 40.6 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది. మెట్రోనగరాలు, పట్టణాల్లోనే కాదు.. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా గ్రామాల్లో సైతం దీని బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని.. మధ్యవయసువారిలో మాత్రమే కాక యువతలో కూడా ఈ సమస్య కనిపిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవనశైలి మార్పులు, ఊబకాయం, మధుమేహం కారణంగా ఈ సమస్య వేగంగా పెరుగుతోందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారిలో అది ముదిరేవరకూ ఎలాంటి లక్షణాలూ కనిపించవు! అందుకే వైద్యనిపుణులు దీన్ని సైలెంట్ డిసీజ్‌గా పేర్కొంటున్నారు.
ఏఐజీ సర్వే..
హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి కూడా ఫ్యాటీ లివర్ విస్తృతిపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పాల్గొన్న మొత్తం 1028 ఐటీ ఉద్యోగుల్లో.. 46 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లు తేలింది. అలాగే.. వారిలో 51 శాతం మంది మధుమేహ బాధితులు, 25ు మంది హెపటైటిస్ బాధితులు ఉన్నారని వైద్యులు వివరించారు. మధుమేహ బాధితుల్లో క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు. గ్రామాల్లో దాదాపు 5 వేల మందిపై అధ్యయనం చేయగా 38 శాతం ఉన్నట్లు నిర్ధారణఅయ్యింది. ఈ అధ్యయనం ఇంకా కొనసాగుతుంది.
జీవనశైలే దోషి..
ఇటీవలికాలంలో ప్రజల జీవన శైలి బాగా మారింది. ఆహార పదార్థాల వినియోగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ చేసేవారి సంఖ్య తగ్గి.. ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ ఫ్యాటీ లివర్‌కు కారణాలేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే దీనిని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్తే.. వైద్యపరీక్షల్లో ఫ్యాటీ లివర్ ఉన్న విషయం బయటపడుతోందని వారు పేర్కొన్నారు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే.. అది లివర్ సిరోసి్‌సకు (కాలేయం గట్టిపడే సమస్య), చివరకు కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. కాలేయ క్యాన్సర్ బాధితుల్లో చాలామందికి ఆ సమస్య ఫ్యాటీ లివర్‌తోనే మొదలవుతోందని తెలిపారు. అంతేకాదు.. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక కొవ్వు.. ఇవన్నీ కలిసి మెటాబాలిక్ సిండ్రోమ్‌కు దారి తీస్తాయని, ఇది కేవలం కాలేయ సమస్యగా చూడకూడదని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.
ఫ్యాటీ లివర్ రావడానికి ప్రధాన కారణాలు
శారీరక శ్రమ లేకపోవడం. కదలకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం.
ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ వినియోగం
మధుమేహం, రక్తపోటు
అధిక బరువు.. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం

ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు
ఫ్యాటీ లివర్ సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా తగ్గించవచ్చు. అయితే, సాధారణంగా ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ముందుగానే పరీక్షల ద్వారా గుర్తించగలిగితే మాత్రం.. 3 నుండి 6 నెలల్లో పూర్తిగా రివర్స్ చేయగలం. దీనికి అనేక రకాల మంచి మందులు ఉన్నాయి. అడ్వాన్స్ స్జేజీలో వచ్చిన వారికి కూడా నయం చేయవచ్చు. అయితే, ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. వారానికి మూడుసార్లు వేగంగా నడవడం.. ఏ సమస్యలూ లేకపోతే రన్నింగ్ వంటివి చేయాలి. చక్కెర వినియోగం తగ్గించాలి. నూనెలో వేయించిన ఆహారం ఎక్కువగా తినకూడదు. అధిక బరువు ఉంటే తగ్గాలి. వైద్యుల సూచనల ప్రకారం.. కాలేయం పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించాలి. బయటి ఆహారం చాలా మేరకు తగ్గించాలి. ఇంట్లోనే వండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మధుమేహం ఉంటే.. దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్య లేనివారితో పోలిస్తే.. ఆ సమస్యతో బాధపడేవారు కాలేయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 10రెట్లు ఎక్కువ. అలాగే.. ఆ సమస్య వల్ల గుండెకు 2 నుంచి 4 శాతం అధిక రిస్కు ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి.
- డాక్టర్ ఆనంద్ వి. కులకర్ణి, డైరెక్టర్
క్రిటికల్ కేర్, సీనియర్ హెపటాలజిస్టు,
ఏఐజీ ఆస్పత్రి