Share News

భారతీయ హార్ట్ సర్జన్‌కు ఫ్రాన్స్ నైట్‌హుడ్‌ పురస్కారం

ABN , Publish Date - Nov 05 , 2026 | 10:15 PM

ప్రముఖ హార్ట్ సర్జన్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డా. దేవి షెట్టిని ఫ్రాన్స్ ప్రభుత్వం నైట్‌హుడ్‌తో సత్కరించింది. బెంగళూరులో ఫ్రాన్స్‌ కాన్సులేట్ కార్యాలయంలో డా. షెట్టికి నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌‌ను ప్రదానం చేశారు.

భారతీయ హార్ట్ సర్జన్‌కు ఫ్రాన్స్ నైట్‌హుడ్‌ పురస్కారం
Dr Devi Shetty - France National Order of Merit

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హార్ట్ సర్జన్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డా. దేవి షెట్టిని ఫ్రాన్స్ ప్రభుత్వం నైట్‌హుడ్‌తో సత్కరించింది. బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సులేట్ కార్యాలయంలో డా. షెట్టికి నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌‌ను ప్రదానం చేశారు. కొవిడ్ సమయంలో ఫ్రెంచ్ వారికి అండగా నిలిచినందుకు ఆయనకు నైట్‌హుడ్ ప్రదానం చేశారు. ‘అసాధారణ సవాళ్లు ఎదురైన సమయంలో డా. షెట్టి, నారాయణ హెల్త్ సంస్థ ఫ్రాన్స్ కాన్సులేట్ సిబ్బందికి, ఫ్రెంచ్ ప్రజలకు అండగా నిలిచాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో పాటు ఇతరత్రా సహకారం అందించి వారు సహకార స్ఫూర్తి, సంఘీభావాన్ని చాటుకున్నారు’ అని కాన్సులేట్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ మార్క్ లామీ మాట్లాడుతూ కొవిడ్ సమయంలో డా.షెట్టి ఫ్రాన్స్ ప్రజలకు అండగా నిలిచారని, తమ ఉదారత చాటుకున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు గుర్తింపుగా ఆయనకు నైట్‌హుడ్ ప్రదానం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఫ్రాన్స్, భారత్‌ల మధ్య స్నేహభావానికి, సంఘీభావానికి ఆయన చర్యలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ గుర్తింపు తనకు గర్వకారణమని డా. షెట్టి కూడా తెలిపారు.


1963లో అప్పటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చార్ల్స్ డి గాల్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. లీజియన్ ఆఫ్ ఆనర్ తరువాత ఫ్రాన్స్ అందించే అత్యున్నత జాతీయ పురస్కారం ఇది. ఫ్రాన్స్ పౌరులతో పాటు విదేశీయులకు ఈ నైట్‌హుడ్ ప్రదానం చేస్తారు. ఈ పురస్కారంలో నైట్‌హుడ్‌తో పాటు ఆఫిసర్, కమాండర్, గ్రాండ్ ఆఫీసర్, గ్రాండ్ క్రాస్ అనే మరో నాలుగు గ్రేడ్స్ ఉంటాయి.


ఈ వార్తలనూ చదవండి:

పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్‌

దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..

Updated Date - Nov 05 , 2026 | 10:22 PM