ఢిల్లీ సాకేత్‌లో పేకమేడలా కూలిన మూడంతస్తుల భవనం, నలుగురి మృతి
ABN , Publish Date - May 31 , 2026 | 06:52 PM
దక్షిణ ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ భవనంలో ఒక కోచింగ్ సెంటర్, కొన్ని కేఫ్‌లు, ఆఫీసులు నడుస్తున్నాయి. పై అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
న్యూఢిల్లీ, మే 31: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన సాకేత్‌లో ఒక మూడంతస్తుల నివాస, వాణిజ్య భవనం చూస్తుండగానే పేకమేడలా కూలిపోయింది. ఈ ధాటికి భవనంలో ఉన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనం సెకన్ల వ్యవధిలో నేలమట్టమైన దృశ్యాల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.
స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. కూలిపోయిన సదరు మూడంతస్తుల భవనంలో విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్, కొన్ని కేఫ్‌లు, ప్రైవేట్ ఆఫీసులు నడుస్తున్నాయి. శనివారం రాత్రి భవనం పై అంతస్తులో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు భవనం పైభాగం నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడటం, స్వల్పంగా దుమ్ము రావడాన్ని గమనించిన కొందరు స్థానికులు అనుమానంతో దానివైపే చూస్తూ నిలబడ్డారు. అయితే, వారు ఊహించని విధంగా కేవలం కొన్ని సెకన్లలోనే ఆ భారీ కట్టడం కుప్పకూలిపోయింది. దీంతో చుట్టుపక్కల జనాలు ప్రాణాలు దక్కించుకోవడానికి భయంతో పరుగులు తీశారు.
రాత్రంతా సాగిన రెస్క్యూ ఆపరేషన్
ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ రెస్క్యూ ఏజెన్సీలు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు రంగంలోకి దిగారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రాత్రంతా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల లోపల ఉన్న వారిని గుర్తించడానికి హైడ్రాలిక్ కట్టర్లు, ప్రత్యేక కెమెరాలు, పోలీస్ జాగిలాలను ఉపయోగించారు. గాయపడిన బాధితులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న, గల్లంతైన వారందరినీ వెలికితీసి, లెక్క తేల్చడంతో ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు.
ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. పై అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా పనులు జరిగాయా? భవన నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. భవనం కూలిపోవడానికి గల కచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ
పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్