సంతానం కోసం తపన! వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్స్ కోసం క్యూకడుతున్న మాజీ నక్సల్స్
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:51 PM
పోరుబాట వీడి సామాన్య జీవితం గడుపుతున్న అనేక మంది మాజీ మావోయిస్టులు తమకంటూ ఓ కుటుంబం, సంతానం ఉండాలని తపిస్తున్నారు. అడవుల్లో ఉండగా వేసక్టమీ చేయించుకున్న అనేక మంది ప్రస్తుతం వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్స్ కోసం క్యూకడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. పోరుబాటను వీడి సామాన్య జీవితాలను గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు తమకంటూ కుటుంబం, సంతానం ఉండాలని తాపత్రయ పడుతున్నారు. అడవుల్లో ఉండగా వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వారు ప్రస్తుతం రివర్సల్ ఆపరేషన్స్ కోసం అధికారుల సాయం కోరుతున్నారు. 10-15 ఏళ్ల క్రితం ఈ ఆపరేషన్స్ చేయించుకున్న కొందరు తమకు అసలు సంతాన భాగ్యం ఉందా? అని ఆందోళన చెందుతున్నారు (Former Naxals Seek vasectomy reversal surgery).
మావోయిస్టుల మధ్య వివాహాలకు అనుమతి ఉన్నా సంతానం కనేందుకు అనుమతి లేదని మాజీ నక్సల్స్ చెబుతున్నారు. వివాహాలు చేసుకున్న నక్సల్స్‌కు సుశిక్షితులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతాయని చెప్పారు. ‘అడవుల్లో నక్సల్స్ మధ్య పెళ్లిళ్ల తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. మావోయిస్టుల మధ్య పెళ్లిళ్లకు అనుమతి ఉంది. కానీ కొన్ని రోజులు కలిసున్నాక భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో విధులకు వెళ్లాల్సి ఉంటుంది. మళ్లీ కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకే క్యాంప్‌లో కొన్ని రోజుల పాటు కలిసి పని చేయాలంటే ముందుగా క్యాడర్ నాయకుల నుంచి అనుమతి తీసుకోవాలి’ అని ఒక మావోయిస్టు తెలిపారు.
‘అడవుల్లోనూ డాక్టర్లు ఉంటారు. ప్రేమలో పడ్డ క్యాడర్ పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు ముందుగా పైఅధికారులకు సమాచారం అందించాలి. ఆ తరువాత వారు మళ్లీ ఎంక్వైరీ చేస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేవని రూఢీ పరుచుకున్నాక పెళ్లికి అనుమతిస్తారు. ఆ తరువాత పురుష మావోయిస్టులు అడవుల్లోని ప్రత్యేక క్యాంపుల్లో ఆపరేషన్ చేయించుకుంటారు. కొందరు ఆసుపత్రుల్లో కూడా చేయించుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులు రెస్టు తీసుకున్నాక మళ్లీ తమ కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు’ అని మరో మావోయిస్టు తెలిపారు.
‘మాలో కొందరు 40వ పడిలో ఉన్నారు. సుమారు 10 -15 ఏళ్ల క్రితం మేము కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించుకున్నాము. జీవితమంతా అడవుల్లోనే గడిచిపోతుందని అప్పట్లో మేము అనుకునేవాళ్లం’ అని వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్న మరో మాజీ మావోయిస్టు తెలిపారు.
గతేడాది దేశవ్యాప్తంగా 2,167మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం తమకు సంతానం ఉండాలని కోరుకుంటున్నారు. వైద్య సాయం కావాలని ప్రభుత్వ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో గత ఆరు నెలల్లో సుమారు 50 మంది రివర్సల్ ఆపరేషన్స్ చేయించుకున్నారు. అధిక శాతం మంది మాత్రం వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్ కోరే వారి సంఖ్య ఎక్కువగా ఉందని బస్తర్ జోన్ ఐజీ పి.సుందర్ రాజ్ తెలిపారు. ‘ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. చాలా మంది తమ జీవితంలో తొలిసారిగా అడవిని దాటి బయటకు వచ్చారు. వారు ప్రశాంత జీవనం గడిపేందుకు కావాల్సిన వైద్య సాయం, కౌన్సెలింగ్ అందిస్తాము’ అని ఆయన తెలిపారు.
పురుషుల్లో వీర్యం ప్రయాణించే వేస్ డిఫెరెన్స్ అనే నాళాలను ముడివేయడం లేదా కత్తిరించడం ద్వారా వేసక్టమీ చేస్తారు. ఫలితంగా శుక్రకణాలకు మార్గం లేక సంతానం కలగదు. మహిళల్లో చేసే ఇదే తరహా ఆపరేషన్లను ట్యూబెక్టమీ అని అంటారు. ఇక వేసక్టమీ రివర్సల్ ఆపరేషన్‌లో మునుపటి నాళాలను మళ్లీ అనుసంధానిస్తారు. ఈ రెండు శస్త్రచికిత్సలూ పూర్తి సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
తల్లిదండ్రులతో పాటు చెల్లిని దారుణంగా హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి..
పెంపుడు కుక్క దాడి.. మహిళకు 50 కుట్లు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!