Share News

రాహుల్‌ కాన్వాయ్‌లో వాహనాలు ఢీ

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:27 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని చివరి వరుసలో ఉన్న ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

రాహుల్‌ కాన్వాయ్‌లో వాహనాలు ఢీ
accident

లఖ్‌నవు, అక్టోబరు 26: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని చివరి వరుసలో ఉన్న ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు, భద్రతా సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారని, రాహుల్‌ గాంధీ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అమిత్‌ షాపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం రాహుల్‌ సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు లఖ్‌నవుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌ ద్వారా కోర్టుకు బయలు దేరారు. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో చివరలో ఉన్న ఓ వాహనానికి డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో మరో నాలుగు వాహనాలు ఇదే వరుసలో ప్రయాణిస్తున్న అంబులెన్సును ఢీ కొన్నాయి. ఇదిలా ఉండగా, ఈ పరువు నష్టం కేసును కోర్టు కొట్టివేసింది. ‘‘అమిత్‌ షా ఓ హత్య కేసులో నిందితుడు అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు పరువునష్టం పరిధిలోకి రావు’’ అని కోర్టు అభిప్రాయపడినట్లు పిటిషనర్‌ విజయ్‌ మిశ్రా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో విజయ్‌ మిశ్రా నేరుగా బాధించబడిన వ్యక్తి కానుందన కేసును కొట్టివేస్తున్నామని కోర్టు పేర్కొందన్నారు. తీర్పును పై కోర్టులో సవాల్‌ చేయనున్నట్టు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 04:28 AM