Share News

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

ABN , Publish Date - Mar 25 , 2026 | 08:09 PM

భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది.

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా
All party meeting on West Asia crisis

న్యూఢిల్లీ: భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్‌లో అఖిల పక్ష సమావేశం (All party meeting) జరిగింది. ఒక గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధర్మేంద్ర యాదవ్,జావెద్ అలీ, సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్, ఎల్‌జేపీ నేత అరుణ్ భారతి, డీఎంకే నేత పి.విల్సన్, ఆప్ ఎం సంజయ్ సింగ్, జేడీయూ నేత రాజీవ్ సింగ్, సంజయ్ ఝా తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ నుంచి ఎవరూ హాజరుకాలేదు.


అఖిలపక్ష సమావేశానంతరం కిరణ్ రిజిజు మాట్లాడుతూ, సమావేశంలో అన్ని పార్టీలు చురుకుగా పాల్గొన్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం, భారత్‌‌పై దాని ప్రభావంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. ప్రభుత్వం సమగ్రంగా, సంపూర్ణంగా స్పందించిందని, విపక్షాలందరి ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని సమర్ధవంతగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతామని విపక్ష పార్టీలు హామీనిచ్చాయని చెప్పారు. 'ప్రస్తుత సంక్షోభ సమయంలో పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సమష్టిగా మద్దతు ఇస్తామని విపక్షాలు తెలిపాయి' అని రిజిజు వివరించారు.


నాలుగైదు రోజుల్లో భారత్‌కు రానున్న 4 నౌకలు

కాగా, దేశంలో ఇంధన భద్రత స్థిరంగా, దేశ ఇంధన అవసరాలకు సరిపడా ఉందని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సరకు కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడంతో పాటు వివిధ దేశాలతో సంప్రదింపులు సాగిస్తున్నామని, నిరంతరాయ ఇంధన సరఫరాకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొన్నాయి. ఎల్‌జీపీ లభ్యత, హోర్ముజ్ జలసంధి మీదుగా షిప్‌మెంట్‌పై సమావేశంలో విపక్షాల ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, మరో నాలుగైదు రోజుల్లో నాలుగు నౌకలు పోర్టుకు చేరుకుంటాయని ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ఇంధన కొరత లేదని, తగినన్ని నిల్వలు ఉన్నాయని వివరించింది. అఖిలపక్షానికి హాజరైన అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, విపక్షాలతో ఏ సమయంలోనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది.


దేశ ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విపక్షాలతో చర్చలకు తలుపులు తెరిచే ఉంటాయని రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారు. యుద్ధంతో తలెత్తిన పరిణామాలు, ఇంధన భద్రతపై ఆందోళనలు, ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను విదేశాంగ కార్యదర్శి మిస్రీ అఖిల పక్ష నేతలకు వివరించారు. మొత్తం మీద.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, దేశీయంగా ప్రజల ఆందోళనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని అఖిలపక్ష సమావేశం ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

రష్యా నుంచి అధిక ధరలకు.. 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసిన భారత్..

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

Updated Date - Mar 25 , 2026 | 08:16 PM