‘సర్’లో అనుమానిత విదేశీయులపై కన్ను!
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:14 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. సర్ ప్రక్రియ చేపట్టే సమయంలో ఎవరైనా అనుమానిత...
అలాంటి కేసులను గుర్తిస్తే.. సంబంధిత అధికారులకు తెలియజేయండి
రాష్ట్రాల యంత్రాంగాలకు ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ, జూన్ 7: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. సర్ ప్రక్రియ చేపట్టే సమయంలో ఎవరైనా అనుమానిత విదేశీయులను గుర్తిస్తే.. అలాంటి కేసులను పౌరసత్వ చట్టం-1955 కింద పనిచేసే సంబంధిత అధికార యంత్రాంగానికి తెలియజేయాలని పేర్కొంది. ఈ విషయంలో అసిస్టెంట్ ఈఆర్వోలు ఈఆర్వో అధికారాలను స్వతంత్రంగా వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎవరివైనా ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి రాకుంటే, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) స్థానిక ఓటర్లను విచారించడం ద్వారా అందుకు గల కారణాలను (అందుబాటులో లేకపోవడం, నివాసం మారడం, మరణించడం, డబుల్ ఎంట్రీ వంటివి) గుర్తించి, నోట్ చేయాలని పేర్కొంది. ఈ మేరకు సర్ సమయంలో అనుసరించాల్సిన విధానాలపై ఈసీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులకు గత నెల 14న వివరణాత్మక కీలక మార్గదర్శకాలు జారీచేసిందని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. గతేడాది బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఈసీ సన్నాహాలు చేస్తుండగా.. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లకు చెందిన పలువురిని క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించినట్లు ఎన్నికల అధికారులు నివేదించారు. అయితే చివరికి, ఓటర్ల జాబితాలో ఉండేందుకు అర్హత లేని అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి గణాంకాలను కానీ, ఆధారాలను గానీ ఎన్నికల అధికారులు వెల్లడించలేదు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలకు అనుకూలంగా లేని ఓటర్లు లక్ష్యంగా సర్ ప్రక్రియను చేపట్టేందుకు ఈసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇటువంటి వాదన అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈసీ ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో సర్ మూడో దశను గత నెల 14న ప్రారంభించిన విషయం తెలిసిందే. మే 30 నుంచి 36.73 కోట్ల ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను దశలవారీగా చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News