పశ్చిమ బెంగాల్‌లో రాజ్యసభ ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:17 PM
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. భారత ఎన్నికల సంఘం ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
కోల్‌కతా, జులై 6: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారైక్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. భారత ఎన్నికల సంఘం ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 24వ తేదీన మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. నామినేషన్ల సమర్పణకు జులై 14 ఆఖరి తేదీ అని పేర్కొంది.
ఎన్నికల సంఘం మూడు ఖాళీలను విడివిడిగా పరిగణిస్తూ ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేసి, పోలింగ్ నిర్వహించనుంది. జులై 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేయడానికి రిటర్నింగ్ అధికారి ఇచ్చే ప్రత్యేక ఊదా రంగు పెన్ను మాత్రమే వాడాలని, ఇతర పెన్నులు వాడితే ఓటు రద్దవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి
వింబుల్డన్: యానిక్ సినర్ దూకుడు.. వరుసగా ఐదోసారి క్వార్టర్ ఫైనల్‌లోకి..
వాస్తు ప్రకారం ఇంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంచొచ్చా?