ఎల్‌నినోతో ఈసారి చలి తక్కువే!
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:55 AM
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
అంచనాలను వెలువరించిన ఐఎండీ
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ప్రభావం: డబ్లూఎంవో
న్యూఢిల్లీ, హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వర్షాకాలం ముగిసి గురువారం నుంచి శీతాకాలం ప్రారంభమైందని తెలిపింది. ఈ అక్టోబరులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, వర్షపాతం తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 18శాతం వర్షపాతం లోటు ఉందని.. నల్లగొండ, నిర్మల్, గద్వాల, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అత్యధిక లోటు నమోదైందని వివరించింది. కాగా, గత నెల ఆరంభంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్లూఎంవో) కూడా ఈసారి భారత్‌లో చలికాలంలో చలి తీవ్రత తక్కువగా ఉండనుందన్న అంచనాలనే వెలువరించింది. పసిఫిక్ సముద్రం మీద ఎల్‌నినో మరింత తీవ్రతరమవుతోందని, దాని ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కొనసాగుతుందని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని డబ్ల్యూఎంవో తెలిపింది. వ్యవసాయం, నీరు, ఆరోగ్యం, ఇంధనం, విపత్తు నిర్వహణ రంగాల్లో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు, సంస్థలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని డబ్ల్యూఎంవో ప్రధాన కార్యదర్శి సెలెస్ట సాలో సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు