Share News

కేరళం మాజీ సీఎం మద్దతుదారుల నిరసన.. ఈడీ వాహనంపై దాడి

ABN , Publish Date - May 27 , 2026 | 03:36 PM

కేరళం మాజీ సీఎం పినరయి విజయ్ నివాసంలో ఈడి రెయిడ్స్‌ను వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

కేరళం మాజీ సీఎం మద్దతుదారుల నిరసన.. ఈడీ వాహనంపై దాడి
Pinarayi Vijayan ED raids

ఇంటర్నెట్ డెస్క్: కేరళం మాజీ సీఎం పినరయి విజయ్ నివాసంలో ఈడి రెయిడ్స్‌ను వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బుధవారం తిరువనంతపురంలో సోదాల అనంతరం తిరిగి వెళుతున్న ఈడీ అధికారుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు రాళ్లతో వాహనంపై దాడి చేయడంతో కారు అద్దాలు దెబ్బతిన్నాయి. ఈడీ రాక నేపథ్యంలో పినరయి విజయన్ నివాసానికి ఆయన మద్దతుదారులు భారీగా చేరుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈడీ అధికారుల వాహనాన్ని అక్కడి నుంచి పంపించేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలని ఈడి దాడులు నిర్వహిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) కేసులో మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాలతో సహా కేరళంలోని 10 ప్రాంగణాల్లో ఈడి సోదాలు నిర్వహిస్తోంది.


తిరువనంతపురంలోని మాజీ సీఎం విజయన్ ప్రస్తుత నివాసంతో పాటు ఆయన స్వస్థలమైన కన్నుర్‌లోని మరో ప్రాంగణం, మాజీ సీఎం విజయన్ అల్లుడు, మాజీ మంత్రి మొహమ్మద్ రియాజ్‌కు చెందిన నివాసం‌లో (కోజికోడ్) కూడా ఈడీ రెయిడ్స్ నిర్వహించింది. సోదాల సమయంలో మాజీ సీఎం, ఆయన కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉండగా బయట మద్దతుదారులు నిరసనలకు తెరతీశారు. సెక్యూరిటీ సిబ్బందిపై కొందరు దాడికి దిగే ప్రయత్నం చేయడంతో పార్టీ సీనియర్ నేతలు వారిని అడ్డుకుని శాంతింపజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


మాజీ సీఎం విజయన్ కూతురు వీణా విజయన్‌కు చెందిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌‌ నుంచి ఎలాంటి సేవలు పొందకుండానే సీఎంఆర్ఎల్ డబ్బులు చెల్లించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ రెయిడ్స్ నిర్వహించింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కూడా రంగంలోకి దిగింది. మొత్తం రూ.2.7 కోట్లు సీఎంఆర్‌‌ఎల్ నుంచి ఎక్సాలాజిక్‌కు అందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఐటీ సర్వీసులు, కన్సల్టెన్సీ సేవల మాటున ఈ చెల్లింపులు సాగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈడీ కేసును కొట్టేయాలంటూ సీఎంఆర్‌ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. మరోవైపు, ఈ ఆరోపణలను మాజీ సీఎం విజయన్ గతంలోనే కొట్టిపారేశారు. తమ ఇమేజీని దెబ్బతీసే లక్ష్యంగా ఈ ఆరోపణలు పుట్టుకొచ్చాయని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు

కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం మే 30..! ఈసారి ముగ్గురు డిప్యూటీ సీఎంలు

Updated Date - May 27 , 2026 | 04:46 PM