Share News

ఓటర్ల జాబితాలో పేరు లేదా?.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం..

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:25 PM

ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా.. తుది జాబితాలో చోటు దక్కించుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది.

ఓటర్ల జాబితాలో పేరు లేదా?.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం..
Election Commission of India

ఢిల్లీ: ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) భారీ ఊరటనిచ్చింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా.. తుది జాబితాలో చోటు దక్కించుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం ఏడు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (CEO) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో గైర్హాజరు, ఇల్లు మారడం, మరణం, డూప్లికేట్ ఓటరు ఐడీ వంటి కారణాలతో ఏఎస్‌డీడీ (Absent, Shifted, Dead, Duplicate) జాబితాలో పడి ఓటు గల్లంతైన వారికి ప్రయోజనం చేకూరనుంది.


ఈ సందర్భంగా గైర్హాజరైనవారు, ఇల్లు మారినవారు, మరణించినవారు, డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించిన వారి జాబితాలను మరోసారి పరిశీలించాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది. ఈ జాబితాలను పోలింగ్ బూత్‌లు, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో మరోసారి ప్రదర్శించాలని సూచించింది. అలాగే, రాష్ట్ర పరిధిలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లకు ఈసీ ప్రత్యేక అవకాశం కల్పించింది. అలాంటి వారు ఫారం-8 సమర్పించకుండానే ఎన్యూమరేషన్ ఫారం, చిరునామా ధ్రువీకరణ పత్రంతో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించి పాత ఓటరు గుర్తింపు కార్డు (EPIC) నంబర్ ఆధారంగా ECINET యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం లభించనుంది.


మరోవైపు, ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బూత్ లెవల్ అధికారులు (BLOs) రాజకీయ పార్టీల ఏజెంట్లతో కలిసి ఇంటింటికీ వెళ్లాలని ఈసీ స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్ల నుంచి అవసరమైన ఫారాలను సేకరించి, వారి పేర్లు తుది జాబితాలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మొత్తంగా, ముసాయిదా జాబితాలో పేరు కనిపించలేదని ఓటు హక్కుపై ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రభుత్వ పథకాల లబ్ధికి ఓటర్ ఐడీ.. బీజేపీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం

Updated Date - Nov 06 , 2026 | 06:15 PM