ఈ20 పెట్రోల్‌పై రంగంలోకి మంత్రి
ABN , Publish Date - Jul 31 , 2026 | 05:06 AM
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా పడింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది....
ఆందోళనకారులతో కేంద్రమంత్రి పురి చర్చలు
నేడు ఢిల్లీలో నిరసనలకు టీమ్ భారత్ సన్నద్ధం
వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
ర్యాలీని వాయిదా వేయాలని సూచన
న్యూఢిల్లీ, జూలై 30: కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా పడింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. బొద్దింకల పార్టీ స్ఫూర్తితో ఈ20 పెట్రోల్‌పై మొదలైన ఆందోళనలను ఆదిలోనే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. తెహసీన్ పూనావాలా నేతృత్వంలో ఏర్పాటైన టీమ్ భారత్.. ఈ20 పెట్రోల్ అమలును నిరసిస్తూ ఢిల్లీలో శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం దానిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా టీమ్ భారత్ ప్రతినిధులను కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పురి బుధవారం కలిసి చర్చలు జరిపారు. 12 ఏళ్ల మోదీ సర్కార్‌లో మార్పు వచ్చిందని, వీధి పోరాటాలకు స్పందిస్తోందని ఆ సమావేశం తర్వాత తెహసీన్ పూనావాలా అన్నారు. తమ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టకముందే ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవడం సానుకూల ముందడుగుగా అభివర్ణించారు. తమ బృందంతో కేంద్ర మంత్రి సమావేశం అవుతారని తాము భావించలేదని పేర్కొన్నారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖతో పాటు వ్యవసాయ, పరిశ్రమల శాఖల అధికారులు కూడా ఆ భేటీలో పాల్గొన్నారని తెలిపారు. 31వ తేదీన తలపెట్టిన ఆందోళన కార్యక్రమంపై పునరాలోచించాలని పురి కోరారని, అలాగే చర్చలు జరుగుతున్నందున నిరసన ర్యాలీని వాయిదా వేసుకోవాలని ఢిల్లీ పోలీసులు సూచించారని చెప్పారు. తమ బృందం అంతర్గతంగా సమాలోచన చేసి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కేంద్ర మంత్రితో భేటీలో టీమ్ భారత్ పలు డిమాండ్లు చేసింది. పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌తో పాటు ప్యూర్ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని, ప్యూర్ పెట్రోల్ కంటే 20 శాతం తక్కువ రేటుకు ఈ20 పెట్రోల్ ఇవ్వాలని కోరింది. ఈ20 పెట్రోల్ వల్ల విదేశీ మారకానికి గానీ, వాహనాల యజమానులకు గానీ ఎలాంటి లాభం లేదని టీమ్ భారత్ వాదిస్తోంది.
2 నుంచి 6 శాతం తగ్గొచ్చు: గడ్కరీ
ఈ20 పెట్రోల్‌తో వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గొచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఆ తగ్గుదల వాహన విభాగం, అది తయారైన సంవత్సరాన్ని బట్టి ఉంటుందన్నారు. ఈ20 పెట్రోల్ అమలు నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. డైనోమోమీటర్‌పై ఇంజన్ సామర్థ్యం పరీక్షలోనూ, ఆన్‌రోడ్ పరీక్షల్లోనూ ఈ20 పెట్రోల్‌తో ఎలాంటి వైఫల్యాలు బయటపడలేదని గురువారం ఆయన లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో వెల్లడించారు. ఈ20 ప్రభావాన్ని మదింపు చేయడానికి ఏఆర్‌ఏఐ, ఎస్‌ఐఏఎం, ఐవోసీఎల్ సంయుక్తంగా పరీక్షలు చేశాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ