దిల్‌జిత్‌తో వివాదానికి ముగింపు పలికిన అభిజీత్ దీప్కే?
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:18 AM
సింగర్ దిల్‌జిత్ దోసాంజ్ తాజాగా ఓ కాన్సర్ట్‌లో పరోక్షంగా స్పందించడంతో అభిజీత్ దీప్కే కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ‘చిన్న తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.. అన్నారు.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 31: ఢిల్లీలోని జవాహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగిన కాన్సర్ట్‌లో ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్‌జిత్ దోసాంజ్ తన సంగీతంతో శ్రోతలను అలరించడంతో పాటు ఒక కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. గతంలో తనపై వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందించారు.
కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనపై దిల్‌జిత్ దోసాంజ్ స్పందిస్తూ.. 'నన్ను ఇలాంటి నిరసనలకు దూరంగా ఉంచండి. నేను ఒక కళాకారుడిని మాత్రమే, రాజకీయనాయకుడిని కాను' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దిల్‌జిత్‌ను విమర్శించారు.
నిన్నటి కాన్సర్ట్ సందర్భంగా దిల్‌జిత్ ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా సమాధానమిచ్చారు. 'నేనొక కళాకారుడిని కాబట్టి మీ అందరినీ ప్రేమిస్తున్నాను. నేను మౌనంగా ఉన్నాను, నన్ను అలాగే ఉండనివ్వండి. నేను మీ అందరికీ మద్దతు ఇస్తున్నాను. పంజాబీలకు ఎలా పోరాడాలో నేర్పించకండి అని అన్నారు. ఈ కాన్సర్ట్ చివరలో 'మై హూ పంజాబ్'.. 'ఐ యామ్ యాన్ ఆర్టిస్ట్' అనే లేజర్ ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది.
అభిజీత్ దీప్కే స్పందన ('మిట్టీ పాఓ')
దిల్‌జిత్ కాన్సర్ట్ వీడియో వైరల్ కావడంతో, CJP అధినేత అభిజీత్ దీప్కే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ వివాదానికి ముగింపు పలకాలనే కోరికను వ్యక్తం చేశారు. 'చిన్న తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని కోరారు. గతంలో దిల్‌జిత్ చేసిన వ్యాఖ్యలు తనకు కొంత బాధ కలిగించినప్పటికీ, కళాకారుడిగా ఆయనపై ఉన్న గౌరవం, అభిమానం ఎప్పటికీ తగ్గలేదని చెప్పారు. గత మే నెలలో చికాగోలో జరిగిన దిల్‌జిత్ కాన్సర్ట్‌కు కూడా తాను హాజరైనట్లు ఆయన గుర్తుచేశారు.(Diljit Dosanjh Abhijeet Deepke Controversy)