మోదీ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన రెండో మంత్రి
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:25 AM
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయ్యాక ఈ 12 ఏళ్లలో ఆయన...
2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో వైదొలగిన ఎంజే అక్బర్
న్యూఢిల్లీ, జూలై 25: సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయ్యాక ఈ 12 ఏళ్లలో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగిన రెండో వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. 2018లో అప్పటి విదేశాంగ సహాయ మంత్రి, సీనియర్ జర్నలిస్టు ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. అప్పట్లో ‘మీ టూ’ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పలువురు మహిళలు అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో విధిలేక ఆయన తప్పుకోవలసి వచ్చింది. వీరంతా ఆయన వివిధ పత్రికలకు సంపాదకుడిగా పనిచేసినప్పుడు.. ఆయనతో పనిచేసినవారే. 2016లో మంత్రి పదవి చేపట్టిన ఆయన.. రెండేళ్లలోపే నిష్క్రమించారు. అంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల హయాంలో వివిధ కారణాలతో మన్మోహన్‌సింగ్ క్యాబినెట్ నుంచి పలువురు పెద్ద పెద్ద నాయకులే వైదొలగాల్సి వచ్చింది. వీరిలో నాటి కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్(2008), విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ (2005), రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ (2013), న్యాయశాఖ మంత్రి అశ్వినీకుమార్ (2013), కమ్యూనికేషన్లు-ఐటీ మంత్రి ఎ.రాజా (2010), శశి థరూర్ (2010) ప్రముఖులు.
ముంబై పేలుళ్ల ఘటనకు నైతిక బాధ్యత వహించి పాటిల్ 2008 నవంబరు 30న రాజీనామా చేశారు.
ఇరాక్ చమురుకు ఆహార పథకం స్కాంలో నట్వర్, ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందినట్లు ఐక్యరాజ్యసమితి వోల్కర్ రిపోర్టు తేల్చడంతో నట్వర్ 2005 డిసెంబరు 8న పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
తన సన్నిహిత బంధువు విజయ్ సింగ్లా రూ.10 కోట్ల డబ్బుతో పట్టుబడడంతో బన్సల్ రైల్వే మంత్రిగా 2013 అక్టోబరు 1న రాజీనామా చేశారు.
ఇక 2జీ స్పెక్ట్రమ్ స్కాంలో డీఎంకేకు చెందిన కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజా 2010 నవంబరు 14న పదవి నుంచి వైదొలిగారు.
కొచ్చి ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజ్ షేర్లు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న శశి థరూర్ 2010 ఏప్రిల్లో రాజీనామా చేశారు.
వాజపేయి హయాంలో 1999లో బెంగాల్లో గైసల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 290 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నైతిక బాధ్యత వహించి నాటి రైల్వే మంత్రి నితీశ్‌కుమార్ పదవికి రాజీనామా చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు